AP Panchayat Election 2026 : ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. గురువారం పోలింగ్తోపాటు ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో టీడీపీ జోరు కొనసాగింది. మేజర్ గ్రామ పంచాయతీల్లోనూ కూటమి మద్దతుదారులే అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు.
Also Read : AP Govt : ఏపీలోని ఆర్టీసీ డ్రైవర్లకు గుడ్న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఇక ఆ ఇబ్బందులకు చెక్ ..
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం మూడు దశల్లో నిర్వహిస్తోంది. తొలి విడత పోలింగ్ గురువారం జరగ్గా.. సాయంత్రంకు ఫలితాలు వెల్లడయ్యాయి. తొలి విడతలో 3,949 సర్పంచ్ పదవులకు నోటిఫికేషన్ విడుదల కాగా.. 760 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 3,189 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. అయితే, ఫలితాల్లో టీడీపీ తన సత్తాచాటింది. ఏకగ్రీవాలు కలుపుకొని 2,321 పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. కూటమిలోని మిగిలిన పార్టీలైన జనసేన పార్టీ మద్దతుదారులు 118, బీజేపీ మద్దతుదారులు 25 పంచాయతీల్లో విజయం సాధించారు. ఇక వైసీపీ మద్దతుదారులు 1,103 పంచాయతీల్లో విజయం సాధించారు. 295 స్థానాల్లో ఇతర పార్టీల సానుభూతిపరులు, స్వతంత్రులు విజయం సాధించారు. మూడు చోట్ల రీ పోలింగ్ నిర్వహిస్తుండగా.. మిగిలిన చోట్ల ఫలితాలు రావాల్సి ఉంది. మొత్తంగా మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల తరహాలోనే పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి హవా కొనసాగింది.
ఇదిలాఉంటే.. తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 77.65శాతం పోలింగ్ నమోదైంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 83.37శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 66.93శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల్లో మూడు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. రీ పోలింగ్ సందర్భంగా ఓటర్ల ఎడమచేతి ఉంగరం వేలికి చెరగని సిరా వేయాలని అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఇదిలాఉంటే.. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 10వేల కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న 52 పెద్ద పంచాయతీల్లో కూటమి మద్దతుదారులు 28 స్థానాల్లో విజయం సాధించారు. వీటిలో టీడీపీ మద్దతుదారులు 25 మేజర్ పంచాయతీల్లో విజయం సాధించగా.. జనసేన మద్దతుదారులు మూడు పంచాయతీల్లో విజయం సాధించారు. వైసీపీ మద్దతుదారులు ఆరు చోట్ల గెలుపొందారు.
తొలిదశలో 3,949 పంచాయతీలకుగాను 760 ఏకగ్రీవం అయ్యాయి. అత్యధికంగా తిరుపతి జిల్లాలో 136 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.

