AP Cabinet Meeting Today: ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఉదయం 10 గంటలకు సచివాలయంలో ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను తీసుకొచ్చే 18 ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మొత్తం రూ.88,392 కోట్ల పెట్టుబడులతో పాటు 54,210 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.

ఆరు కీలక రంగాల్లో పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. ఇందులో శ్రీసత్యసాయి జిల్లాలో కియా పరిశ్రమ విస్తరణ ప్రతిపాదన ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సుమారు రూ.19 వేల కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న ఈ విస్తరణ ద్వారా మరో 12 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు తెలుస్తోంది. అలాగే అనకాపల్లి జిల్లా తూటిపాలలో 200 ఎకరాల్లో భారీ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు కూడా మంత్రివర్గం అనుమతి ఇవ్వనుంది. ఇందుకోసం రూ.47,009 కోట్ల పెట్టుబడి పెట్టే ప్రతిపాదనను పరిశీలించనుంది. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి రూ.1,921 కోట్లకు పైగా విలువైన పనులకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాజధాని పరిధిలోని 26 గ్రామాల్లో రూ.1,215.70 కోట్లతో రహదారులు, డ్రెయిన్ల నిర్మాణం చేపట్టనున్నారు. అదేవిధంగా రూ.80 కోట్లతో గ్రీనరీ అభివృద్ధి పనులు చేపట్టే ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించనుంది.

ఏపీ క్యాపిటల్ రీజియన్ పరిధిలో బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు, అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్, జంట టవర్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని సీఆర్‌డీఏకు మళ్లించే ప్రతిపాదనలపై కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకోనుంది. రాజధానిలో ఐదు కీలక రహదారుల అభివృద్ధికి ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) నిధులు వినియోగించేందుకు అనుమతి ఇవ్వనుంది. ఎల్‌పీఎస్ జోన్-10లో మౌలిక వసతుల అభివృద్ధికి ఏఐఐబీ ఆర్థిక సహకారం పొందే అంశం కూడా ఎజెండాలో ఉంది. అమరావతి సంగమం ప్రాజెక్టును రూ.626.14 కోట్లతో నిర్మించే ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. రాజధానిలో పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం నిర్మాణాలతో పాటు గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ భవన నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

అధికారిక ఎజెండాలోని అంశాలపై చర్చ పూర్తయిన తర్వాత రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. రానున్న అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపైనా మంత్రివర్గ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. పెట్టుబడులు, రాజధాని అభివృద్ధి, రాజకీయ అంశాల నేపథ్యంలో నేటి క్యాబినెట్ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.