AP Gram Panchayat Elections 2026 Phase 1 Polling:  ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది.  రాష్ట్రంలోని 201 మండలాల పరిధిలో పోలింగ్ జరుగుతోంది.   తొలి విడతలో 3,949 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా,  758 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,191 సర్పంచ్ స్థానాలకు, అలాగే 25,061 వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్  జరుగుతుంది.   మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది.              

ఈ తొలి విడత పోరులో సాధారణ పంచాయతీలతో పాటు మేజర్ గ్రామ పంచాయతీల పై ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. అధిక ఓటర్లు, భారీ ఆదాయ వనరులు, నియోజకవర్గ రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపే మేజర్ పంచాయతీలను కైవసం చేసుకునేందుకు అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తలపడుతున్నాయి. క్షేత్రస్థాయిలో అభ్యర్థుల బలాబలాలు, సామాజిక సమీకరణాలు, స్థానిక నేతలు ఇస్తున్న మద్దతు మేజర్ పంచాయతీల్లో గెలుపోటములను నిర్ణయించనున్నాయి. ముఖ్యంగా కీలక మండల కేంద్రాలు, పెద్ద జనాభా కలిగిన మేజర్ పంచాయతీల్లో పోటీ రసవత్తరంగా మారడంతో అభ్యర్థులు చివరి నిమిషం వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 650 మంది ఓటర్లకు మించకుండా చూడాలని, ఎన్నికల ప్రక్రియ సీసీటీవీ ఫుటేజ్‌ను కనీసం 60 రోజుల పాటు భద్రపరచాలని స్పష్టం చేశారు. అలాగే సమస్యాత్మక గ్రామాల్లో మొబైల్ పోలీసు బృందాలతో నిరంతర నిఘా ఉంచాలని, పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మరోవైపు, ఎన్నికల బందోబస్తు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎస్పీ స్థాయి నుంచి హోంగార్డు వరకు సుమారు 46 వేలకు పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. ముఖ్యంగా పల్నాడు నుంచి రాయలసీమ జిల్లాల వరకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు, సమస్యాత్మక కేంద్రాల వద్ద సీసీటీవీలు, డ్రోన్లు, బాడీ వోర్న్ కెమెరాలతో నిఘా పెట్టినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. అనుమానితులపై ముందస్తు బైండోవర్ కేసులు నమోదు చేశామని, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత కల్పించామని, అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.                          

 , జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వేడి చల్లారకముందే పల్లె పోరు మొదటి ఘట్టానికి చేరుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. మేజర్ పంచాయతీల ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా వస్తాయి, పోటీలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం ఎలా ఉండబోతుందనేది   మధ్యాహ్నం తర్వాత తేలనుంది.