Megastar Chiranjeevi on drugs: దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, అలాంటి యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ భూతానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
'నషా ముక్త్ భారత్ అభియాన్'కు మద్దతు
ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన 'నషా ముక్త్ భారత్ అభియాన్'లో భాగంగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న 'వాక్ ఫర్ నషా ముక్త్ భారత్' కార్యక్రమానికి చిరంజీవి తన మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కిషన్ రెడ్డి స్వయంగా చిరంజీవిని ఆహ్వానించారు. అంతేకాకుండా, ఈ యాత్రకు సంబంధించిన ప్రత్యేక టీ-షర్టులను కూడా ఇద్దరూ కలిసి ఆవిష్కరించారు. నవంబర్ 25, 26, 27 తేదీల్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటున్నట్లు చిరంజీవి వెల్లడించారు.
ప్రజా ఉద్యమంగా మారాలి
డ్రగ్స్ వినియోగం వల్ల కేవలం ఒక వ్యక్తి జీవితం మాత్రమే కాకుండా, ఆ కుటుంబంలోని ఆనందం, భవిష్యత్తు కూడా నాశనమవుతాయని చిరంజీవి అన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజలందరూ, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున పాల్గొని భాగస్వాములు కావాలని చిరంజీవి కోరారు. ఇది కేవలం ఒక కార్యక్రమానికి పరిమితం కాకుండా, సమాజాన్ని కాపాడే ప్రజా ఉద్యమంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
Also Read:డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
యువతకు చిరంజీవి ప్రత్యేక సందేశం
యువతను ఉద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ, "మన జీవితానికి లక్ష్యాన్ని వ్యసనంగా మార్చుకోండి.. వ్యసనాన్ని జీవితంగా మార్చుకోకండి" అంటూ అత్యంత స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. కలలు, లక్ష్యాల వైపు పయనిస్తూ యువత తమ శక్తిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. "రండి.. మన యువత భవిష్యత్తు కోసం, మన కుటుంబాల ఆనందం కోసం, మాదక ద్రవ్యాలు లేని సమాజం కోసం అందరం కలిసి అడుగులు వేద్దాం." అని అన్నారు. చివరగా "నషా ముక్త్ హైదరాబాద్.. నషా ముక్త్ తెలంగాణ.. నషా ముక్త్ భారత్.. జై హింద్" అంటూ చిరంజీవి వీడియో సందేశాన్ని ముగించారు.
Also Read: హైదరాబాద్‌లో 3 రోజులపాటు ‘నషా ముక్త్ భారత్’ పాదయాత్ర.. నగరంలో ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

