నల్గొండ, నవంబర్ 9: ప్రభుత్వ ఉద్యోగం కోసం అక్రమ మార్గాన్ని ఎంచుకున్న ఘటన నల్గొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి, కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం పొందిన కేసులో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంలో ఉద్యోగం పొందిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన మొత్తం 14 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండటంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చామకూరి వెంకటేశ్వర్లు నల్గొండ జిల్లా శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (PHC) హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేశారు. గతేడాది మే 31న ఆయన ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం నవంబర్ 17న కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మరణించారు.

అయితే, వెంకటేశ్వర్లు ఉద్యోగంలో కొనసాగుతున్న సమయంలోనే మరణించినట్లు నకిలీ పత్రాలు సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పత్రాల ఆధారంగా ఆయన కుమారుడు చామకూరి రాజు కారుణ్య నియామకం కింద దామరచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగం పొందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారంలో ఉద్యోగం పొందిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన బంధువులు, మున్సిపల్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 14 మందిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, వారిని రిమాండ్‌కు తరలించారు.

నకిలీ డెత్ సర్టిఫికెట్ వ్యవహారం బయటపడటంతో మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టి అక్రమ నియామకం వెనుక ఉన్న వ్యవహారాన్ని ఛేదించారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో నకిలీ ధ్రువపత్రాల వినియోగం ఎంతటి పరిణామాలకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.