Fans Await Update About Anushka Shetty New Movie: సినిమాలు చేయకపోయినా కొంతమంది హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. తమ వ్యక్తిగత విషయాలు, సినిమా అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంటారు. కానీ సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి మాత్రం ఇందుకు భిన్నం. ఈ మధ్య కాలంలో ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించడం లేదు. దీంతో అనుష్క అభిమానులు కొత్త సినిమా అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అనుష్క చివరిగా నటించిన ‘ఘాటీ’ విడుదలై ఏడాది దాటిపోయినా.. ఆమె నుంచి మరో కొత్త సినిమా ప్రకటన రాలేదు. మరోవైపు మలయాళంలో మూడేళ్ల క్రితం అంగీకరించిన ‘కథనార్’ సినిమా కూడా ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఈ మూవీ ట్రైలర్ విడుదలై ఏడు నెలలు దాటుతున్నా.. సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయంపై చిత్రబృందం స్పష్టత ఇవ్వలేదు. మలయాళ స్టార్ హీరో జయసూర్య ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్‌తో కథనార్ తెరకెక్కుతోంది. ఇందులో నీల అనే కీలక పాత్రలో అనుష్క కనిపించనుంది. శ్రీ గోకులం మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 15 భాషల్లో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా విడుదల కోసం అనుష్క ఫాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.

నవంబర్ 7న అనుష్క పుట్టినరోజు సందర్భంగా అయినా కథనార్ నుంచి ఏదైనా అప్‌డేట్ వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పలేదు. కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చిత్రబృందం నుంచి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో స్వీటీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అనుష్క కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌గా ‘బాహుబలి 3’ ఉండొచ్చనే ప్రచారం గతంలో జరిగింది. అయితే ఈ సినిమాపై ఇప్పటివరకు అధికారిక స్పష్టత లేదు. అనుష్క కొత్త సినిమా ఎప్పుడు ప్రకటిస్తుందో, కథనార్ ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సినిమాలకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న స్వీటీ.. త్వరలోనైనా అభిమానులకు ఏదైనా స్వీట్ న్యూస్ చెబుతుందేమో చూడాలి.