అమరావతి, నవంబర్‌ 9: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక మార్పులు రానున్నాయి. 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల విధానంలో పలు మార్పులు తీసుకురావడానికి ఇంటర్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పరఖ్ (PARAKH) నిబంధనలకు అనుగుణంగా ప్రశ్నపత్రాల రూపకల్పనలో మార్పులు చేయనుంది. ఈ విధానం అమల్లోకి వస్తే విద్యార్థులు పాఠ్యాంశాలను కంఠస్థం చేసి సమాధానాలు రాస్తే సరిపోదు. సబ్జెక్టుపై అవగాహన, విశ్లేషణాత్మక ఆలోచన, సమస్యల పరిష్కార సామర్థ్యాలను కూడా నిరూపించుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో పరీక్షలు, ప్రశ్నపత్రాల రూపకల్పన, విద్యార్థుల సామర్థ్యాల అంచనాలో ఏకరూపత తీసుకురావడమే పరఖ్ నిబంధనల ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు కూడా కొత్త విధానంపై దృష్టి సారించారు. ఇప్పటికే ఈ నిబంధనలపై ఎన్‌సీఈఆర్టీ ఆధ్వర్యంలో అధికారులకు ప్రత్యేక కార్యశాల నిర్వహించారు.

ప్రస్తుత విధానంలో పాఠ్యపుస్తకాల్లోని పాఠాల చివర ఇచ్చిన ప్రశ్నల నుంచే ఎక్కువగా పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో చాలామంది విద్యార్థులు ప్రశ్నలు, సమాధానాలను కంఠస్థం చేసి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ విధానానికి స్వస్తి పలికి విద్యార్థుల్లో నిజమైన విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించేలా కొత్త ప్రశ్నలను రూపొందించనున్నారు. కొత్త విధానంలో విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచనా శక్తిని పరీక్షించేలా 10 శాతం ప్రశ్నలు ఇవ్వాలని ఇంటర్ విద్యా మండలి భావిస్తోంది. పాఠ్యాంశాల్లోని సమాచారాన్ని యథాతథంగా గుర్తుంచుకోవడం కాకుండా, వాటిని అర్థం చేసుకుని విశ్లేషించి సొంతంగా సమాధానాలు రాసేలా ప్రశ్నలను రూపొందించనున్నారు.

విద్యార్థుల్లో కింది నైపుణ్యాలను అంచనా వేయనున్నారు.. అవేంటంటే?

  • విశ్లేషణాత్మక ఆలోచన: ఒక అంశాన్ని వివిధ కోణాల్లో పరిశీలించి సరైన నిర్ణయానికి వచ్చే సామర్థ్యం.
  • సమస్యల పరిష్కారం: ఎదురయ్యే సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలను కనుగొనడం.
  • సృజనాత్మకత: కొత్త ఆలోచనలు, విభిన్నమైన పరిష్కారాలను ప్రతిపాదించడం.
  • సహకార నైపుణ్యం: ఇతరులతో కలిసి పనిచేయడం, బాధ్యతలు పంచుకోవడం, భిన్నమైన అభిప్రాయాలను గౌరవించడం.
  • విషయ పరిజ్ఞానం: పాఠ్యాంశాలను కేవలం కంఠస్థం చేయకుండా వాటిపై పూర్తి అవగాహన కలిగి ఉండటం.

కొత్త ప్రశ్నపత్రాల విధానానికి అనుగుణంగా పాఠ్యపుస్తకాల్లో కూడా మార్పులు చేయనున్నారు. ఇందుకోసం సబ్జెక్టు నిపుణుల నుంచి ఇప్పటికే ప్రశ్నలను ఆహ్వానించారు. ఇంటర్ విద్యా మండలి సమావేశంలో వాటికి ఆమోదం లభించిన తర్వాత వచ్చే విద్యా సంవత్సరంలో ముద్రించే పాఠ్యపుస్తకాల్లో కొత్త తరహా ప్రశ్నలను చేర్చనున్నారు. కొత్త పరీక్షా విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు అధ్యాపకులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థుల్లో కేవలం పరీక్షల్లో మార్కులు సాధించే సామర్థ్యమే కాకుండా, ఆచరణాత్మక పరిజ్ఞానం, సృజనాత్మకత, ఆలోచనా శక్తిని పెంపొందించేలా బోధనా పద్ధతుల్లో మార్పులు తీసుకురానున్నారు. జాతీయ విద్యా విధానం-2020 లక్ష్యాలకు అనుగుణంగా ఎన్‌సీఈఆర్టీ పరిధిలో ఏర్పాటు చేసిన జాతీయ మూల్యాంకన కేంద్రం పరఖ్ ద్వారా దేశవ్యాప్తంగా పరీక్షల స్వరూపాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మార్పులు అమల్లోకి వస్తే ఇంటర్ విద్యార్థుల పరీక్షల సన్నద్ధతలోనూ కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.