అమరావతి, నవంబర్ 9: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కీలక అప్డేట్. పరీక్ష ఫీజు చెల్లింపునకు ప్రభుత్వ పరీక్షల విభాగం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 11 నుంచి 25వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. గడువు దాటిన తర్వాత ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు కూడా విడతలవారీగా అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులురెడ్డి వివరాలు వెల్లడించారు.
ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు తేదీలు ఇవే!
పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు అధికారులు మూడు విడతల్లో గడువు ప్రకటించారు.
- నవంబర్ 11 నుంచి 25 వరకు: ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు.
- నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు: రూ.50 ఆలస్య రుసుముతో చెల్లించవచ్చు.
- డిసెంబర్ 3 నుంచి 9 వరకు: రూ.200 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించవచ్చు.
- డిసెంబర్ 10 నుంచి 15 వరకు: రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది.
పదో తరగతి పరీక్ష ఫీజు వివరాలు
విద్యార్థులు ఎన్ని సబ్జెక్టులు రాస్తున్నారనే దాని ఆధారంగా పరీక్ష ఫీజు నిర్ణయించారు.
- మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు రాసే రెగ్యులర్ విద్యార్థులు: రూ.125.
- మూడు సబ్జెక్టుల వరకు రాసే రెగ్యులర్ విద్యార్థులు: రూ.110.
- వృత్తి విద్యా కోర్సుల అభ్యర్థులు: అదనంగా రూ.60.
- వయోపరిమితి నిబంధనల నుంచి మినహాయింపు కోరే విద్యార్థులు: రూ.300 అదనపు రుసుము చెల్లించాలి.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత గడువులోగా పరీక్ష ఫీజు చెల్లించాలని అధికారులు సూచిస్తున్నారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా నవంబర్ 25లోపు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించడం మంచిది. ఆలస్యమైతే అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తమ పాఠశాలల ద్వారా పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.

