Airtel Buy 1 Get 1: ఎయిర్‌టెల్ (Airtel) తన ప్రీపెయిడ్ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. రూ.349, రూ.399 రీఛార్జ్ ప్లాన్లపై Buy 1 Get 1 Free ఆఫర్‌ను అందిస్తోంది. అంటే ఒకసారి రీఛార్జ్ చేస్తే అదే ప్లాన్‌పై మరో రీఛార్జ్ ఉచితంగా పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉండనుంది. అయితే, ప్రస్తుతం ఎంపిక చేసిన కొంతమంది వినియోగదారులకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తోంది.

ఈ ఆఫర్‌లో భాగంగా Airtel రూ.349 ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకుంటే మరో రూ.349 రీఛార్జ్ ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 2GB డేటాతో పాటు ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ 5G డేటా పొందవచ్చు. అలాగే అన్‌లిమిటెడ్ లోకల్, STD కాల్స్, రోజుకు 100 SMSలు అందిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు కాగా, ఉచిత రీఛార్జ్‌తో కలిపి మొత్తం 56 రోజుల సేవలు పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్లాన్‌తో 12 నెలల Adobe Express Premium సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలో ట్యూన్స్, ఎయిర్‌టెల్ సేఫ్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. దీని ద్వారా స్పామ్ కాల్ అలర్ట్స్, మోసపూరిత లింకుల బ్లాకింగ్, OTP స్కామ్‌లపై AI ఆధారిత హెచ్చరికలు అందిస్తారు.

ఇక రూ.399 ప్లాన్ విషయానికి వస్తే.. ఇందులో అన్‌లిమిటెడ్ 4G, 5G డేటా అందిస్తున్నారు. ఇందులో రోజువారీ డేటా పరిమితి ఉండదు. 5G స్మార్ట్‌ఫోన్ మాత్రమే కాకుండా 4G హ్యాండ్‌సెట్లలోనూ అన్‌లిమిటెడ్ 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ లోకల్, STD కాల్స్, రోజుకు 100 SMSలు, 12 నెలల Adobe Express Premium సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి. ఈ ప్లాన్‌పై కూడా Buy 1 Get 1 Free ఆఫర్ వర్తిస్తే మొత్తం 56 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు.

Airtel

కాకపోతే ఈ ఆఫర్ అందరికీ అందుబాటులో లేదు. అర్హత ఉందో లేదో తెలుసుకోవడానికి ముందుగా “Airtel Thanks” యాప్‌ను ఓపెన్ చేసి రూ.349 లేదా రూ.399 ప్లాన్‌ను చెక్ చేయాలి. అక్కడ ‘1+1 Recharge Free’ అనే ట్యాగ్ కనిపిస్తేనే ఈ ఆఫర్ మీ నంబర్‌కు వర్తిస్తుంది. రీఛార్జ్ చేసే ముందు యాప్‌లోని ఆఫర్ నిబంధనలు, ఉచిత రీఛార్జ్ యాక్టివేషన్ వివరాలను పరిశీలించడం మంచిది. ఎయిర్‌టెల్ ఈ ఉచిత రీఛార్జ్ ఎలా క్రెడిట్ అవుతుందనే విషయంపై ఇంకా అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించలేదు.