Vijayasai Reddy Comments On YS Jagan Coterie:  ఒకప్పుడు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి  నెంబర్ 2 గా, కుడిభుజంగా వ్యవహరించిన రాజ్యసభ మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి శైలి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. వైఎస్సార్‌సీపీకి, రాజ్యసభ పదవికి వీడ్కోలు పలికిన ఆయన పదకొండో తేదీన కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు.  ఈ క్రమంలో జగన్ పరిపాలనలోనే తనకు అత్యంత ఘోరమైన అవమానాలు జరిగాయని, వైఎస్ రాజశేఖరరెడ్డి  కాలంలో ఏనాడూ తనకు ఇటువంటి పరాభవం ఎదురుకాలేదని చేసిన బహిరంగ వ్యాఖ్యలు పార్టీ శ్రేణులను విస్తుపోయేలా చేశాయి. వైఎస్ కుటుంబానికి నాలుగు దశాబ్దాలుగా సేవ చేసిన తానను, జగన్ తీరు వల్లనే నానా అవమానాలు భరించి బయటకు రావాల్సి వచ్చిందని ఆయన ఘాటుగా స్పష్టం చేశారు.

అవమానాలకు ప్రతీకారంగానే కొత్త పార్టీ? 

విజయసాయిరెడ్డి ప్రకటనలు, ఆయన తాజా పొలిటికల్ మూవ్స్ గమనిస్తే.. ఆయన ముమ్మాటికీ వైఎస్ జగన్‌కు, వైఎస్సార్‌సీపీ అజెండాకు పూర్తి వ్యతిరేకంగానే తన కొత్త రాజకీయ ప్రస్థానాన్ని నిర్మించుకుంటున్నారని పక్కా క్లారిటీ వస్తోంది.  విజయవాడ వేదికగా నూతన పార్టీ జెండా, ఎజెండాను ప్రకటించేందుకు సమాయత్తమవుతున్న సాయిరెడ్డి, తన ఆత్మగౌరవానికి జరిగిన గాయాలకు,  తను ఎదుర్కొన్న మానసిక అవమానాలకు రాజకీయంగా ప్రతీకారం తీర్చుకునే లక్ష్యంతోనే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.  జగన్ స్వయంగా తనపై విషం చిమ్మలేదని, ఆయన చుట్టూ చేరిన  చెప్పుడు మాటల కోటరీ  వల్లనే జగన్ మనసు మారిందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. మూడేళ్లకు పైగా తనను క్రిందికి దిగజార్చేందుకు, పార్టీలోని ఇతర నేతలకు లబ్ధి చేకూర్చేందుకు ఆ కోటరీ పన్నిన కుట్రలనే జగన్  నమ్మారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, రాజకీయ వాస్తవాల ప్రకారం జగన్ చుట్టూ ఉన్న ఆ కోటరీ నేతలను నేరుగా రాజకీయంగా దెబ్బతీయడం సాయిరెడ్డికి సాధ్యపడదు. కాబట్టి, ఆ కోటరీకి ప్రాణవాయువుగా ఉన్న జగన్‌నే ప్రధాన లక్ష్యంగా చేసుకుని దాడి చేయడమే ఆయన ముందున్న ఏకైక మార్గంగా మారింది.

కోటరీ పేరుతో టార్గెట్ చేసి జగన్‌నే ! 

పార్టీని వీడిన కొత్తలో కొంత సైలెంట్‌గా ఉన్నప్పటికీ, ఇప్పుడు ప్రత్యక్ష వేదికలపైకి వచ్చి జగన్ నిర్ణయాలను, ఆయన నాయకత్వ లోపాలను విజయసాయిరెడ్డి ఎండగడుతుండటం సాధారణ రాజకీయ పరిణామం కాదు. వైఎస్సార్‌సీపీ ఆర్థిక లావాదేవీలు, అంతర్గత నిర్ణయాలు, తాడేపల్లి ప్యాలెస్ వ్యవహారాలు ,  ఢిల్లీ స్థాయి నెట్‌వర్క్ గురించిన ప్రతి గుట్టు సాయిరెడ్డి వేళ్లపై ఉంది. జగన్ వైఫల్యాలను చట్టపరంగా, రాజకీయంగా బయటపెట్టడానికి ఆయన వద్ద ఉన్న సమాచారమే ఆయనకు అతిపెద్ద ఆయుధంగా మారనుంది. రాబోయే రోజుల్లో విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీ ద్వారా వైఎస్సార్‌సీపీ క్వేడర్‌ను, ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గం, రాయలసీమ/కోస్తా నేతలను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసే అవకాశం ఉంది. 

వైసీపీ అసంతృప్త నేతలకు వల 

జగన్ విధానాల వల్ల నష్టపోయిన అసంతృప్త నేతలకు ఆయన అడ్డాగా మారే సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటివరకు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మాత్రమే వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేస్తుండగా, ఇప్పుడు పార్టీ గుట్టు తెలిసిన ఇంసైడర్ సాయిరెడ్డి కూడా తోడవడంతో వైఎస్సార్‌సీపీకి పొలిటికల్ డిఫెన్స్ మరింత కష్టంగా మారనుంది.   అవమానం పొందిన శత్రువు కంటే, ఒకప్పుడు అత్యంత ఆప్తుడిగా ఉండి బయటకు వచ్చిన నేత చేసే రాజకీయ దాడే అత్యంత ప్రమాదకరమైనది. కోటరీ రాజకీయాల వల్ల దూరమైన విజయసాయిరెడ్డి, జగన్ ఇమేజ్‌ను ,  వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకును దెబ్బతీయడమే ప్రధాన అజెండాగా రాబోయే రోజుల్లో తన పొలిటికల్ దాడిని మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.