YSRCP Vote Bank Shift To Congress AP:  ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ప్రకాశం జిల్లా చీరాల కార్పొరేషన్, మున్సిపాలిటీ పరిధిలో వెలువడిన ఫలితాలు ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపాయి. ఎన్డీయే కూటమి అఖండ విజయాన్ని సాధించినప్పటికీ, ఇక్కడ ప్రధాన విపక్ష స్థానంలో ఉన్న వైఎస్సార్‌సీపీని మూడో స్థానానికి నెట్టి కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా రెండో స్థానానికి చేరుకోవడం సంచలనంగా మారింది. దీంతో ఏపీలో కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటోందంటూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఊహాగానాలు, ప్రచారాలు షురూ అయ్యాయి. అయితే ఈ ఫలితాన్ని క్షుణ్ణంగా విశ్లేషిస్తే బయటపడే నిజం వేరేలా ఉంది.

ఆమంచి వ్యక్తిగత ఫాలోయింగ్ ఎక్కువ

నిజానికి చీరాలలో కాంగ్రెస్‌ సాధించిన ఈ ఆధిక్యత వెనుక పార్టీ మార్క్ ప్రభావం కంటే కూడా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారనేది తిరుగులేని వాస్తవం. ఆమంచికి నియోజకవర్గంలో పటిష్టమైన వ్యక్తిగత ఓటు బ్యాంక్ ఉంది. ఆయన గతంలో టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీలలో ఏ పార్టీలో ఉన్నా లేదా స్వతంత్రంగా పోటీ చేసినా ఆయనతో నడిచే నిశ్శబ్ద కేడర్ చీరాలలో ఉంది. ఆమంచి వైఎస్సార్‌సీపీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత, తన వ్యక్తిగత బలంతో స్థానిక ఫలితాలను శాసించి వైఎస్సార్‌సీపీని వెనక్కి నెట్టి హస్తం జెండాను రెండో స్థానంలో నిలబెట్టగలిగారు.

కాంగ్రెస్ పార్టీకి ఊపిరి 

అయినప్పటికీ, ఈ ఫలితం ద్వారా ఏపీ కాంగ్రెస్ పార్టీకి ఒక అత్యంత సానుకూల సంకేతం  లభించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. క్షేత్రస్థాయిలో ప్రజల్లో పట్టున్న బలమైన నాయకులు గనుక ముందుకు వస్తే, ఏపీ ప్రజలు మళ్లీ కాంగ్రెస్‌ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారనే స్పష్టమైన సందేశాన్ని చీరాల తీర్పు ఇచ్చింది. విభజన గాయాల తర్వాత సున్నాకు పడిపోయిన కాంగ్రెస్ గ్రాఫ్, సరైన క్యాండిడేట్ ఉంటే మళ్లీ పుంజుకునే అవకాశం ఉందనే నమ్మకం ఇతర నియోజకవర్గాల నేతల్లో చిగురించేలా చేసింది.

కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా జగన్ సొంతం ! 

ఈ సమీకరణం వెనుక మరో పెద్ద రాజకీయాంశం దాగి ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఆవిర్భావమే ప్రధానంగా నాటి సంప్రదాయ కాంగ్రెస్ మూలాలు,  ఓటు బ్యాంక్ నుంచి జరిగింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఇమేజ్, కాంగ్రెస్ పాత అనుబంధంతోనే అప్పట్లో జగన్ వెనుక ఓటర్లంతా నిలిచారు. అయితే, కొన్నేళ్లుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీజేపీతో కలసి సాగుతున్నారన్న ప్రచారం వ్ల ఓటు బ్యాంక్ అసంతృప్తిగా ఉంది.  
చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ ఏ విధంగా ఒక బలమైన ప్రత్యామ్నాయంగా నిలిచి వైఎస్సార్‌సీపీలోని పాత కాంగ్రెస్ ఓటర్లను తిరిగి హస్తం గూటికి రాబట్టగలిగారో.. అదే మాదిరిగా ఏపీలోని మిగిలిన 174 నియోజకవర్గాల్లోనూ గెలుపు గుర్రాలైన నేతలను కాంగ్రెస్ బరిలోకి దించగలిగితే పరిస్థితి మారుతుంది. 

వైఎస్సార్‌సీపీ స్థానంలో పాత కాంగ్రెస్ ఓటు బ్యాంకంతా తిరుగు ప్రయాణమై మళ్లీ కాంగ్రెస్ జెండా నీడకు చేరుకోవడం ఖాయమని పొలిటికల్ పండితులు అంచనా వేస్తున్నారు. చీరాల తీర్పు కేవలం ఆమంచి కృష్ణమోహన్ విజయమే కావచ్చు, కానీ అది ఏపీలోని వైఎస్సార్‌సీపీకి ఒక పవర్ ఫుల్ హెచ్చరిక లాంటిది. నాయకత్వ బలహీనతతో కూరుకుపోతున్న జగన్ పార్టీలోని ఓటు బ్యాంకును ఆకర్షించే సత్తా మళ్లీ కాంగ్రెస్‌కు ఉందనే విషయం స్పష్టమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభావవంతమైన నేతలకు కాంగ్రెస్ నాయకత్వం ఆహ్వానం పలికి, బలమైన అభ్యర్థులను నిలబెడితే.. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ మూలాలకే కాంగ్రెస్ గండికొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.