CM Revanth Reddy: గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ మహిళలకు కనీసం ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే నెపంతో ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేశారని ఆరోపించారు. చెల్లి తప్పు చేసినా క్షమించి అక్కున చేర్చుకునేవాడే అసలైన అన్న అని, కానీ కేటీఆర్ మాత్రం జైలు నుంచి వచ్చిన తన చెల్లిని అనాథలా బయటకు పంపించేశారని వ్యాఖ్యానించారు. 34 నెలల నుంచి తన కుటుంబం గురించి పట్టించుకోకుండా, కంటి నిండా నిద్ర పోకుండా, ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా ప్రజల కోసం కష్టపడుతున్నాను అన్నారు. 

తన సొంత నియోజకవర్గం కొడంగల్‌ పరిధిలోని హకీంపేటలో ఏర్పాటు చేసిన మహిళా సంఘాల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా నవంబర్ 19న రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు 'ఇందిరమ్మ చీరలు' పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.

మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రాధాన్యం  

ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... పిల్లల చదువు, వారి ఉన్నత ఎదుగుదలే మహిళల నిజమైన అభ్యున్నతి అని, అందుకే ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకంలో మహిళలకే మొదటి ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ఆడబిడ్డలకు సామాజిక, ఆర్థిక భరోసా కల్పించేందుకే ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిటే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో బియ్యం, కరెంట్ బిల్లులు, రవాణా ఖర్చులతో ప్రజలపై భారం పడేదని, ఉచితంగా సన్నబియ్యం, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ద్వారా ఆ భారాన్ని తగ్గించామని పేర్కొన్నారు. ఫ్రీ బస్ కల్పిస్తే బీఆర్‌ఎస్ నేతలు ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి గొడవలు చేయించారని విమర్శించారు. గత 70 ఏళ్లలో ఏ సీఎం చేయని విధంగా 1,000 ఆర్టీసీ బస్సులకు మహిళలనే యజమానులుగా చేశామని చెప్పారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ శిల్పారామం వద్ద 'ఇందిర మహిళా శక్తి' స్టాళ్లు, క్యాంటీన్లను ప్రత్యేకంగా కేటాయించామని తెలిపారు.

Also Read: దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

బొంరాస్‌పేట్‌లో పోలీస్ స్టేషన్, జూనియర్ కాలేజీ  ప్రారంభం

దీపావళి పండుగ సందర్భంగా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని బొంరాస్‌పేట్‌లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్, ప్రభుత్వ జూనియర్ కాలేజీని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని గదులను, కాలేజీ తరగతి గదులను ఆయన స్వయంగా పరిశీలించి టవివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా ఎస్పీ, అధికారులు, విద్యార్థులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Also Read: హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్