Man Dies at Wine Shop in Hyderabad | హైదరాబాద్‌లో పండుగ పూట ఒక కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. మద్యం కొనుగోలు చేసేందుకు వెళ్లిన వ్యక్తి.. వైన్స్ షాపు వద్ద జరిగిన ఘర్షణలో సిబ్బంది దాడిలో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. పండుగ పూట మద్యం తాగి సరదాగా గడపాలనుకుంటే ఏకంగా ప్రాణం పోవడంతో ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..
హైదరాబాద్‌లోని అత్తాపూర్ పిల్లర్ నంబర్ 140 సమీపంలో ఉన్న ఒక వైన్ షాప్‌లో మద్యం కొనేందుకు నాగరాజు (45) అనే వ్యక్తి వెళ్లాడు.  మద్యం కొనుగోలు చేయడానికి వచ్చిన నాగరాజుకు, వైన్ షాప్ సిబ్బందికి మధ్య చిల్లర డబ్బుల విషయమై వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం ముదిరి ఘర్షణకు దారితీసింది. 

ఈ క్రమంలో వైన్స్ సిబ్బంది దాడి చేయడంతో  గుండె భాగంలో తీవ్రమైన గాయం కావడంతో నాగరాజు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన తోటివారు వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, పరీక్షించిన డాక్టర్లు అప్పటికే నాగరాజు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ దారుణ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

చిల్లర డబ్బుల వివాదం.. ఆర్టీసీ కండక్టర్ మృతి

మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 4న మృతి చెందారు. అక్టోబర్ 25న మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో బాలుడి టికెట్, చిల్లర విషయంలో మిట్టగూడెంకు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు కండక్టర్ ప్రవళికతో వాగ్వాదానికి దిగింది. 

మిట్టగూడెం వద్ద సదరు ప్రయాణికురాలు దిగేందుకు ప్రయత్నించగా, కండక్టర్ ఆమెను అశ్వాపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు బస్సును ముందుకు పోనివ్వాలని డ్రైవర్‌కు చెప్పారు. దాంతో భయాందోళనకు గురైన ప్రయాణికురాలు కండక్టర్‌ ప్రవళికను తోసివేయడంతో,  కదులుతున్న బస్సు వెనుక చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడ్డారు.

తొలుత భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించినా ఫలితం దక్కలేదు. 10 రోజుల చికిత్స తర్వాత ఆమె కన్నుమూశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ఎల్లయ్య తెలిపారు. ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారంతో పాటు ఆమె తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 1 కోటి ఇన్సూరెన్స్ అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవళిక కుటుంబానికి భరోసా ఇచ్చారు.