Telangana Madiga JAC Demands Governor Quota MLC Post for Dr Pidamarthi Ravi

ఆదిలాబాద్: డాక్టర్ పిడమర్తి రవికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని తెలంగాణ మాదిగ జేఏసీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి  విజ్ఞప్తి చేసింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్ మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షులు నక్క రాందాస్ మాదిగ సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని భగవంతుడిని ప్రార్థించడమే కాకుండా, భవిష్యత్తులో కూడా ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు.

ఈ వేడుకల సందర్భంగా మాదిగ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణతో పాటు వివిధ సంక్షేమ పథకాల అమలులో మాదిగ ఉపకులాలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి, రాష్ట్రం సిద్ధించే వరకు అవిశ్రాంతంగా పోరాడిన  ఉద్యమకారుడు, మాదిగ జాతి అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తున్న ఉన్నత విద్యావంతుడు డాక్టర్ పిడమర్తి రవి సేవలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఆయనకు సముచిత స్థానం కల్పిస్తూ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా కమిటీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ కార్యదర్శి బిక్కీ గంగన్న మాదిగ, తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా కోశాధికారి లింగంపల్లి ప్రసన్నకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కత్తి గంగాధర్ మాదిగ, జిల్లా కార్యదర్శి తార రవికుమార్ మాదిగ, మండల అధ్యక్షులు జెల్ల మహేందర్ మాదిగ, పట్టణ అధ్యక్షులు బట్టు మహేందర్ మాదిగ, పట్టణ కార్యదర్శి మంద సురేష్ మాదిగ, డివిజన్ కార్యదర్శి కాంపెల్లి మల్లయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.