Diwali Celebrations In Hyderabad | హైదరాబాద్: దీపావళి పండుగ వేడుకల వేళ బాణసంచా కాల్చే క్రమంలో పలువురు ప్రమాదాలకు గురై గాయపడ్డారు. పండుగ సందర్భంగా సంభవించిన ప్రమాదాల్లో కంటి గాయాల పాలైన బాధితులు మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి భారీగా క్యూ కట్టారు. బాణసంచా వెలిగించే సమయంలో చోటుచేసుకున్న ప్రమాదాల కారణంగా ఇప్పటివరకు మొత్తం 48 మంది కంటి గాయాలతో ఆసుపత్రికి వచ్చినట్లు డాక్టర్లు వెల్లడించారు.
బాధితుల్లో 38 మందికి అవుట్ పేషెంట్లుగా ప్రాథమిక చికిత్స అందించగా, తీవ్ర గాయాలైన మరొక 10 మందిని ఇన్ పేషెంట్లుగా చేర్చుకుని డాక్టర్లు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. నవంబర్ 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు నమోదైన బాధితుల వివరాలను ఆసుపత్రి వర్గాలు అధికారికంగా విడుదల చేశాయి. ఆసుపత్రిలో చేరిన వారిలో చిన్నపిల్లలతో పాటు వివిధ వయసులకు చెందిన పెద్దవారు కూడా ఉన్నారు.
అయితే, సరోజినీ దేవి ఆసుపత్రిలో చేరిన బాధితులందరి విషయంలోనూ అదృష్టవశాత్తు చూపు శాశ్వతంగా కోల్పోయేంతటి తీవ్రమైన ప్రమాదమేమీ లేదని వైద్యులు స్పష్టం చేశారు. పండుగ సంబరాలు ఇంకా కొనసాగుతుండటంతో మరిన్ని కేసులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న ఆసుపత్రి యాజమాన్యం, ఎంతమంది బాధితులు వచ్చినా సత్వర చికిత్స అందించేందుకు అన్ని రకాల అత్యవసర ఏర్పాట్లను సిద్ధం చేసింది.

