ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ-2026 (DSC-2026) / ఏపీటీఆర్టీ-2026 (APTRT-2026) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2,111 ఉపాధ్యాయ పోస్టులను ఈ నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్కూల్ అసిస్టెంట్ (SA): 906 పోస్టులు, సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT): 1,205 పోస్టులు వరకు ఉన్నాయి.
జిల్లాల వారీగా పోస్టుల వివరాలను పరిశీలిస్తే కర్నూలు జిల్లాలో అత్యధికంగా 389 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో 266, వైఎస్సార్ కడప జిల్లాలో 206 ఖాళీలు ఉన్నాయి. మిగిలిన జిల్లాల వారీగా పోస్టుల పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించవచ్చు. సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు కనీస మార్కుల అర్హత 45 శాతంగా ఉంటుంది. ఎన్సీటీఈ (NCTE) లేదా ఆర్‌సీఐ (RCI) గుర్తింపు పొందిన సంస్థ నుంచి రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.Ed/D.El.Ed) లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (B.El.Ed) పూర్తి చేసి ఉండాలి. ఏపీ టెట్ (APTET) లేదా సీటెట్ (CTET) పేపర్-1లో అర్హత సాధించి ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ (SA) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 45 శాతం మార్కులు అవసరం. సంబంధిత మెథడాలజీతో బీఈడీ (B.Ed) లేదా బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విద్యార్హతలు ఎన్సీటీఈ/ఆర్‌సీఐ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఉండాలి. అలాగే ఏపీ టెట్ లేదా సీటెట్ పేపర్-2లో అర్హత సాధించి ఉండాలి.
ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపికను ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ నియామక పరీక్ష ద్వారా చేపడతారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్షకు సంబంధించిన సిలబస్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఇప్పటి నుంచే సిలబస్ ప్రకారం ప్రిపరేషన్ ప్రారంభించడం మంచిది. ఏపీలో 2,111 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ-2026 ప్రకటన రావడంతో టీచర్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు మంచి అవకాశం లభించింది. ముఖ్యంగా ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సిద్ధమవుతున్న వారు పరీక్ష సిలబస్, గత ప్రశ్నపత్రాలు, మాక్ టెస్టులపై దృష్టి పెట్టాలి. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది.
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: నవంబర్ 11, 2026.
- దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 30, 2026.
- ఆన్‌లైన్ మాక్ టెస్ట్: డిసెంబర్ 5, 2026.
- హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: డిసెంబర్ 14, 2026.
- పరీక్షల ప్రారంభం: డిసెంబర్ 20, 2026.
- పరీక్షల ముగింపు: జనవరి 13, 2027.

