Ajinkya Rahane: జస్‌ప్రీత్ బుమ్రా లేదా భువనేశ్వర్ కుమార్ కాదు.. నెట్స్‌లో అత్యంత డేంజరస్ బౌలర్ అతనేనంటూ టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) కీలక విషయాన్ని బయటపెట్టాడు. టెస్ట్ లేదా వన్డే (ODI) ఏదైనా సరే.. మ్యాచ్‌లను గెలిపించే సత్తా షమీకి ఉందని, ఎన్నో కష్టకాలాలను ఎదుర్కొని గ్రౌండ్‌కి వచ్చి తన కమిట్‌మెంట్ ఏంటో నిరూపించుకున్నాడని రహానే ప్రశంసించాడు. షమీలాంటి ఆటగాడు మా టీమ్‌లో ఉండటం తమ అదృష్టమన్నాడు. ఇటీవల షమీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రహానే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నెట్స్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ కంటే కూడా షమీని ఎదుర్కోవడమే అత్యంత ప్రమాదకరంగా ఉండేదని రహానే గుర్తుచేసుకున్నాడు. షమీ వేసే బంతుల సీమ్ పొజిషన్ (Seam position) అద్భుతంగా ఉంటుందని చెప్పాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడల్లా ‘నేను మ్యాచ్ గెలిపిస్తాను’ అని ముందుకొచ్చేవాడని, ఆ ఆటిట్యూడ్ (Attitude) ఎప్పుడూ షమీలో ఉంటుందని కొనియాడాడు.

గత ఏడాది మార్చిలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ తర్వాత షమీ భారత్ తరఫున మళ్లీ టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. అయితే, షమీకి మరోసారి టెస్ట్ టీమ్‌లో అవకాశం దక్కాల్సిందని రహానే అభిప్రాయపడ్డాడు. షమీ కూడా చాలా ప్రయత్నించాడని, ముఖ్యంగా దేశవాళీ క్రికెట్‌కు (Domestic cricket) వెళ్లి మరీ శ్రమించాడని తెలిపాడు. ఓ అనుభవజ్ఞుడైన ప్లేయర్ డొమెస్టిక్ క్రికెట్‌కి వెళ్లి తన వంతు ప్రయత్నం చేసి రాణించాడని చెప్పాడు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు అన్ని మ్యాచ్‌ల్లోనూ ఒకేలా రాణిస్తారని ఆశించలేమని, అలాంటి సమయాల్లోనే అనుభవం పనికొస్తుందని రహానే వివరించాడు. భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) లాగే షమీ కూడా కమ్‌బ్యాక్ ఇస్తాడని తాను ఆశించానని అన్నాడు. షమీ చేతుల్లో మ్యాజిక్, అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయని, రంజీ ట్రోఫీలోనూ (Ranji Trophy) వికెట్లు తీశాడని గుర్తుచేశాడు. షమీ పడిన కష్టాన్ని చూసి, అతనికి టెస్ట్ క్రికెట్‌లో మరో అవకాశం దక్కాలని కోరుకున్నట్లు రహానే తన మనసులోని మాట బయటపెట్టాడు.

ఇదిలా ఉండగా.. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ ఇటీవల (Mohammed Shami), టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పేశాడు. సరిగ్గా 13 సంవత్సరాల క్రితం, అంటే నవంబర్ 6, 2013న టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టిన షమీ.. అదే తేదీన తన టెస్ట్ ప్రయాణానికి ముగింపు పలికాడు. భారత్ తరఫున 64 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన షమీ, 122 ఇన్నింగ్స్‌ల్లో 27.71 సగటుతో, 3.30 ఎకానమీ రేటుతో మొత్తం 229 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ కెరీర్‌లో అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 6/56గా ఉండగా, 12 సార్లు నాలుగు వికెట్ల హాల్స్, 6 సార్లు ఐదు వికెట్ల హాల్స్ (Five-wicket haul) సాధించాడు.