Congress Donations Fall 75%: దేశంలోని అత్యంత పురాతన రాజకీయ పార్టీల్లో ఒకటైన కాంగ్రెస్‌కు వచ్చే విరాళాలు భారీగా తగ్గాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.20,000 కంటే ఎక్కువగా వచ్చిన మొత్తం విరాళాలు రూ.130.7 కోట్లకు పరిమితమయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.517.4 కోట్లతో పోలిస్తే ఏకంగా 75 శాతం తగ్గుదల నమోదైంది. అంటే గత ఏడాదితో పోలిస్తే కాంగ్రెస్‌కు వచ్చిన విరాళాలు దాదాపు నాలుగో వంతుకు పడిపోయాయి.

ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ సమర్పించిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విరాళాల నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం.. ఆ ఏడాది కాంగ్రెస్‌కు వచ్చిన మొత్తం విరాళాల్లో ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ వాటా 19 శాతంగా ఉంది. అయితే 2024-25లో ఈ ట్రస్ట్ వాటా 41.8 శాతంగా ఉండటం గమనార్హం.

కార్పొరేట్ విరాళాల్లోనూ భారీ తగ్గుదల

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. గత ఏడాది కాంగ్రెస్‌కు కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చిన విరాళాల్లో ప్రధాన భాగం ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారానే అందింది. కాంగ్రెస్‌కు విరాళాలు అందించిన ఏకైక ఎలక్టోరల్ ట్రస్ట్ కూడా ఇదే కావడం విశేషం. అయితే ప్రూడెంట్ ట్రస్ట్ నుంచి కాంగ్రెస్‌కు రూ.25 కోట్ల విరాళాలు మాత్రమే అందాయి. 2024-25లో ఇదే ట్రస్ట్ కాంగ్రెస్‌కు రూ.216 కోట్లను అందించింది. దీంతో ఈసారి ట్రస్ట్ నుంచి వచ్చిన విరాళాల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది.

విరాళాలు తగ్గడానికి కారణాలేంటి?

2024-25తో పోలిస్తే 2025-26లో కాంగ్రెస్‌కు రూ.20,000 కంటే ఎక్కువగా వచ్చిన విరాళాలు 75 శాతం తగ్గడానికి అనేక కారణాలు ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

2024-25 సాధారణ ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి భారీగా విరాళాలు రావడం సహజమే. 2023-24తో పోలిస్తే ఆ ఏడాది కాంగ్రెస్‌కు వచ్చిన విరాళాలు 84 శాతం పెరిగాయి. అయితే 2025-26లో వచ్చిన రూ.130.7 కోట్ల విరాళాలు.. 2023-24లో వచ్చిన మొత్తంతో పోలిస్తే కూడా దాదాపు 53 శాతం తక్కువగా ఉండటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు 2025-26లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అలాగే 2026 ఏప్రిల్‌లో జరగనున్న అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతున్న సమయంలోనే ఈ తగ్గుదల చోటుచేసుకుంది.

కాంగ్రెస్‌కు విరాళాలు ఇచ్చిన సంస్థలు, వ్యక్తులు వీరే!

ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్‌తో పాటు పలు సంస్థలు, వ్యక్తులు కూడా కాంగ్రెస్‌కు విరాళాలు అందించారు. వారిలో ముఖ్యంగా..

స్టార్ సిమెంట్ లిమిటెడ్ – రూ.5 కోట్లు

సజ్జన్ భజంకా – రూ.4 కోట్లు

అఫ్నాన్ కన్‌స్ట్రక్షన్స్ – రూ.3 కోట్లు

ప్రేమ్ కుమార్ భజంకా – రూ.2 కోట్లు

ఇప్సమ్ ప్రోఅడ్వైజర్స్ – రూ.1 కోటి

ఎస్ఎంఎస్ బిల్డర్స్ – రూ.1 కోటి

రూ.1 కోటి లేదా అంతకంటే ఎక్కువ విరాళాలు కేవలం 9 మంది వ్యక్తులు, సంస్థల నుంచి మాత్రమే వచ్చాయి. వీటి మొత్తం విలువ దాదాపు రూ.43 కోట్లుగా ఉంది.

చిన్న విరాళాల ద్వారా రూ.37.2 కోట్లు

మరోవైపు రూ.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ మొత్తంలో వచ్చిన 1,321 విరాళాల ద్వారా కాంగ్రెస్‌కు మొత్తం రూ.37.2 కోట్లు సమకూరాయి. ఇది పార్టీకి వచ్చిన మొత్తం విరాళాల్లో 28.5 శాతంగా ఉంది. దీంతో కాంగ్రెస్‌కు విరాళాలు ఇచ్చిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, పార్టీ మొత్తం నిధుల్లో పెద్ద మొత్తంలో విరాళాలు అందించిన కొద్దిమంది వ్యక్తులు, సంస్థల వాటా గణనీయంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ఆడిట్ నివేదికపై ఆసక్తి

కాంగ్రెస్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి ఆడిట్ నివేదిక వెలువడితే పార్టీకి ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. 2024-25లో కూపన్ల జారీ, విక్రయాల ద్వారా కాంగ్రెస్‌కు రూ.350 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. దీంతో ఈసారి విరాళాలు తగ్గినప్పటికీ కూపన్ల విక్రయాలు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా పార్టీకి ఎంత నిధులు సమకూరాయన్న అంశంపై ఆసక్తి నెలకొంది.