అమరావతి, నవంబర్ 8: ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వార్షిక పరీక్షల మధ్య రెండు రోజుల విరామం? ఫిబ్రవరి 24 నుంచి పరీక్షలు! ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒత్తిడి తగ్గించి, పరీక్షలకు మెరుగ్గా సిద్ధమయ్యే అవకాశం కల్పించే దిశగా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. ఇంటర్ వార్షిక పరీక్షల మధ్య ప్రస్తుతం ఇస్తున్న ఒకరోజు వ్యవధిని రెండు రోజులకు పెంచాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. దీనివల్ల విద్యార్థులకు పాఠ్యాంశాల పునశ్చరణకు మరింత సమయం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఒకరోజు ప్రథమ సంవత్సరం, మరోరోజు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రతి పరీక్షకు కనీసం ఒకరోజు విరామం లభిస్తోంది. అయితే ఈ వ్యవధిని రెండు రోజులకు పెంచితే విద్యార్థులు పరీక్షలకు మరింత సమర్థంగా సిద్ధమయ్యే అవకాశం ఉంటుందని విద్యాశాఖ భావిస్తోంది.
పరీక్షల మధ్య రెండు రోజుల విరామం?
ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు రెండు రకాల టైమ్‌టేబుళ్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఒకటి ప్రస్తుతం అమల్లో ఉన్న సాధారణ విధానంలో ఉండగా, మరొకటి ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండేలా రూపొందించారు. ఈ రెండు షెడ్యూళ్లను పరిశీలించి విద్యాశాఖ తుది నిర్ణయం తీసుకోనుంది. పరీక్షల మధ్య ఎక్కువ సమయం ఉంటే విద్యార్థులు గతంలో చదివిన పాఠ్యాంశాలను మరోసారి పునశ్చరణ చేసుకోవచ్చని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. పరీక్షల ఒత్తిడి తగ్గడంతో పాటు మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో రెండు రోజుల వ్యవధి ఉండే టైమ్‌టేబుల్‌కే ఆమోదం లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే పరీక్షల పూర్తి షెడ్యూల్, ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షల తేదీలు, సెలవుల వివరాలు అధికారిక టైమ్‌టేబుల్ విడుదలైన తర్వాత స్పష్టమవుతాయి.
గత ఏడాది పదో తరగతిలో ప్రయోగం
గత విద్యా సంవత్సరంలో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలోనూ విద్యాశాఖ ఇదే తరహా విధానాన్ని అమలు చేసింది. మార్చి 14న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 13న ముగిశాయి. పరీక్షల మధ్య ఎక్కువ వ్యవధి ఇవ్వడంతో కొన్ని సబ్జెక్టులకు నాలుగైదు రోజుల విరామం కూడా లభించింది. అయితే పరీక్షల మధ్య ఇంత ఎక్కువ సమయం అవసరం లేదంటూ కొందరు విమర్శలు చేయడంతో పాటు ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అయినప్పటికీ విద్యాశాఖ తన నిర్ణయాన్ని కొనసాగించింది. ఈ విధానం వల్ల పదో తరగతిలో 95.15 శాతం ఉత్తీర్ణత నమోదైందని, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత 2.37 శాతం పెరిగిందని విద్యాశాఖ సమర్థించుకుంది.
ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో చాలామంది డిసెంబరు లేదా సంక్రాంతి పండుగ వరకు జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతుంటారు. ఆ తర్వాత ఇంటర్ వార్షిక పరీక్షలపై దృష్టి పెడతారు. ఈ నేపథ్యంలో పరీక్షల మధ్య రెండు రోజుల విరామం ఉంటే పునశ్చరణకు మరింత సమయం దొరుకుతుందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పదో తరగతి పరీక్షల మధ్య వ్యవధిని తగ్గించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. మొత్తానికి ఇంటర్ పరీక్షల మధ్య విరామం పెంపుపై విద్యాశాఖ తీసుకునే తుది నిర్ణయం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.

