ఫ్లోరిడా ఫోర్ట్ పియర్స్‌లోని ‘సేవ్ ది చింప్స్’ (Save The Chimps) జంతు సంరక్షణ కేంద్రం భారీ వర్షాల కారణంగా నీటమునిగి చింపాంజీల దగ్గరకు వెళ్లడం సిబ్బందికి అసాధ్యంగా మారింది. సాధారణంగా ఉపయోగించే గోల్ఫ్ కార్టులు, ఇతర వాహనాలు వరద నీటిలో ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది.

150 ఎకరాల్లో విస్తరించిన ఈ కేంద్రంలో ఒకవైపు వరద నీరు మరోవైపు ఆకలితో ఉన్న మూగజీవాలు! దీంతో సిబ్బంది వినూత్న పరిష్కారాన్ని ఆలోచించారు. వరదలు తగ్గే వరకు ఎదురుచూడకుండా ఆహారం, ఇతర అవసరమైన వస్తువులను పేపర్ బ్యాగుల్లో ఉంచి డ్రోన్‌కు అమర్చి చింపాంజీలు ఉన్న ప్రాంతాలకు పంపించారు.

డ్రోన్ నుంచి అరటిపండు బ్యాగ్.. ఆనందంగా తిన్న కాలేబ్!

ఈ వీడియోలో కాలేబ్ అనే చింపాంజీకి డ్రోన్ ద్వారా అరటిపండ్లు అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డ్రోన్ గాల్లో నుంచి జాగ్రత్తగా ఓ పేపర్ బ్యాగును కిందకు వదిలింది. అందులో ఉన్న అరటిపండును తీసుకున్న కాలేబ్ ఎంతో ఇష్టంగా తింటూ కనిపించింది. మరోవైపు డ్రోన్ ద్వారా పంపించిన దుప్పటిపై ఓ చింపాంజీ హాయిగా విశ్రాంతి తీసుకుంటుండగా దాని పక్కనే ఉన్న మరో చింపాంజీ చెవిలోని చిన్న పురుగులను తొలగిస్తూ కనిపించింది. ఈ దృశ్యాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

View this post on Instagram

A post shared by Save the Chimps (@savethechimps)

చింపాంజీలకు తప్పిన ప్రమాదం .. భారీగా ఆస్తి నష్టం!

ఈ వీడియోను సేవ్ ది చింప్స్ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ సంరక్షణలో ఉన్న చింపాంజీలన్నీ క్షేమంగా ఉన్నాయని వెల్లడించింది. అయితే వరదల కారణంగా కేంద్రానికి భారీ నష్టం వాటిల్లిందని, రోడ్లు దెబ్బతిన్నాయనీ తెలిపింది. గోల్ఫ్ కార్టులు, ఫోర్ వీల్ డ్రైవ్ వాహనం, ఆహారాన్ని నిల్వ చేసే వాక్-ఇన్ కూలర్‌కు సంబంధించిన కంప్రెసర్‌తో పాటు ఇతర పరికరాలు దెబ్బతిన్నాయని తెలిపింది. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు తమకు ప్రజల సహాయం అవసరమని విజ్ఞప్తి చేసింది.

ఎత్తైన ప్రాంతాల్లో చింపాంజీలు సేఫ్!

ఈ ఘటనపై సంస్థ సీఈఓ అనా పౌలా టవారెస్ మాట్లాడుతూ,  చింపాంజీలు నివసించే ద్వీపాల్లో వాటి సంరక్షణ కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఎన్ క్లోజర్ ఎత్తైన ప్రాంతాల్లో ఉండటంతో అవి సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. అయితే నీరు నిలిచిపోవడంతో సిబ్బంది విధులకు హాజరుకావడం, జంతువులకు అవసరమైన సేవలు అందించడం సవాలుగా మారిందని అన్నారు.

వరద నీరు పూర్తిగా తగ్గిన తర్వాత కేంద్రానికి జరిగిన నష్టం ఎంత? తిరిగి యథావిధిగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఎలాంటి మరమ్మతులు అవసరం అన్న విషయాలపై అంచనా వేస్తామని చెప్పారు. మొత్తానికి ఆపదలో ఉన్న చింపాంజీలకు డ్రోన్ సాయంతో ఆహారం, దుప్పట్లు అందించిన సిబ్బంది చొరవ ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది. టెక్నాలజీని ఉపయోగించి మూగజీవాల ఆకలి తీర్చిన ఈ ప్రయత్నం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తలకు ఇక్కడ చూడండి