Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి హఠాత్తుగా మారిపోయింది. ఈశాన్య రుతుపవన గాలుల ప్రభావం తీవ్రతరం కావడంతో రాబోయే రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆకాశం మేఘావృతమై పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికితోడు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
కోస్తా, తెలంగాణ జిల్లాల్లో అప్రమత్తత.. ఉరుములు, మెరుపులతో పిడుగుల ముప్పు:
ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు(Heavy Rain Alert) కురిసే సూచనలు ఉన్నాయి. ఈ మార్పుల వల్ల ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గి చలి వాతావరణం నెలకొనే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రైతులు, నగరవాసులకు అధికారుల హెచ్చరికలు.. సురక్షిత ప్రాంతాలకు చేరాలని సూచన:
వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. గాలులు వీచే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, ప్రచార హోర్డింగుల కింద నిలబడవద్దని కోరారు. ఇక కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవకుండా రైతులు టార్పాలిన్లతో కప్పి ఉంచాలని, పిడుగుపడే ప్రమాదం ఉన్నందున పొలాల్లో ఒంటరి చెట్ల కింద ఆగకుండా పక్కా భవనాల్లోకి వెళ్లాలని హెచ్చరించారు.

