Enough Phone: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పెద్ద డిస్ప్లేలు, భారీ ఫోన్లకు బదులుగా చిన్న సైజులో ఉండే కాంపాక్ట్ ఫోన్లను ఇష్టపడేవారి కోసం మరో కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చింది. Enough అనే కంపెనీ Enough Phone పేరుతో కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ డిజైన్, సైజు విషయంలో iPhone 13 Miniని గుర్తు చేస్తోంది. 5.3 అంగుళాల డిస్ప్లే, 50MP ప్రధాన కెమెరా, 3500mAh రిమూవబుల్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Enough Phone ధర ఎంత?
Enough Phone ధరను 449 డాలర్లుగా కంపెనీ ప్రకటించింది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.42,000. Early Bird ఆఫర్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉందని సమాచారం. కంపెనీ బాక్స్‌లో గ్లాస్ స్క్రీన్ ప్రొటెక్టర్, USB-C కేబుల్‌ను కూడా అందిస్తోంది. ఈ ఫోన్‌ను కంపెనీ అధికారిక వెబ్సైట్లో లిస్ట్ చేసింది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.3 అంగుళాల కాంపాక్ట్ డిస్ప్లే ఇచ్చారు. ఇది 1520 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఫోన్ కొలతలు 133 x 64 x 12 మిల్లీమీటర్లుగా ఉన్నాయి. చిన్న సైజు ఫోన్ కావాలనుకునేవారికి ఇది ఒక ప్రత్యామ్నాయంగా నిలవనుంది. ముఖ్యంగా iPhone 13 Miniలో 5.4 అంగుళాల డిస్ప్లే ఉండగా, Enough Phoneలో 5.3 అంగుళాల స్క్రీన్ ఉంది. Enough Phoneలో MediaTek Dimensity 7500 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది 4nm తయారీ ప్రక్రియపై రూపొందించారు. దీనికి 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ జత చేశారు. అదనంగా మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. దీని ద్వారా స్టోరేజ్‌ను మరింత పెంచుకోవచ్చు.
50MP కెమెరా.. 32MP సెల్ఫీ కెమెరా
కెమెరా విభాగంలో ఈ ఫోన్ వెనుకవైపు 50MP ప్రధాన కెమెరాను అందించారు. ఇందులో Sony IMX766 సెన్సార్‌ను ఉపయోగించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32MP కెమెరా ఇచ్చారు.
3500mAh రిమూవబుల్ బ్యాటరీ
Enough Phoneలో 3,500mAh బ్యాటరీ ఉంది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ బ్యాటరీని అవసరమైనప్పుడు బయటకు తీసి మార్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం చాలా స్మార్ట్ఫోన్లలో బ్యాటరీని సులభంగా మార్చలేని పరిస్థితి ఉండగా, రిమూవబుల్ బ్యాటరీ ఫీచర్ ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
5G, eSIM, Wi-Fi 6 సపోర్ట్
కనెక్టివిటీ పరంగా Enough Phoneలో 5G నెట్వర్క్ సపోర్ట్ ఉంది. అలాగే Wi-Fi 6, ఫిజికల్ సిమ్‌తో పాటు eSIM సదుపాయం కూడా కల్పించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇందులో 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను కూడా అందించారు.

