హైదరాబాద్, అక్టోబర్ 30: రైల్వేలో శిక్షణ పొందాలనుకునే నిరుద్యోగ యువతకు శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) – నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వే (ఎన్‌డబ్ల్యూఆర్‌), జైపూర్ పరిధిలోని వివిధ వర్క్‌షాప్‌లు, యూనిట్లలో 2,008 యాక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, డీజిల్‌ మెకానిక్‌ తదితర ట్రేడ్లలో శిక్షణ అవకాశాలు కల్పించనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ఎన్‌సీవీటీ లేదా ఎస్‌సీవీటీ గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

రాత పరీక్ష లేదు.. మెరిట్‌ ఆధారంగా ఎంపిక

ఈ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. పదో తరగతి, ఐటీఐలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌ జాబితాను రూపొందించి ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు రుసుము రూ.100గా నిర్ణయించారు. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్‌ 22, 2026లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రైల్వేలో అప్రెంటిస్‌ శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.