Sathupally NDRF Rescue: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలో ఆందోళన కలిగించిన రెస్క్యూ ఆపరేషన్ సుఖాంతమైంది. జలదిగ్బంధంలో చిక్కుకున్న మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రమాదవశాత్తు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సత్తుపల్లి పోలీసులు సకాలంలో స్పందించడంతో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు.
అసలేం జరిగింది?
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సత్తుపల్లి పరిధిలో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వరద నీటిలో చిక్కుకున్న కొంతమంది మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే, వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో సహాయక చర్యల్లో ఉన్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు.
ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ ఆపరేషన్
గల్లంతైన సిబ్బంది కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే గాలింపు చర్యలు చేపట్టాయి. తెల్లవారుజామున ప్రవాహంలో చిక్కుకున్న 6 గురు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని సహాయక బృందాలు సురక్షితంగా కాపాడాయి. ఆ తర్వాత మరికొద్ది సేపటికి మరొక 4 గురిని రెస్క్యూ చేసి ప్రాణాలతో కాపాడారు. ఇక మరో సిబ్బంది వరద ఉద్ధృతి నుంచి ప్రాణాలు దక్కించుకోవడానికి ఒక చెట్టుపైకి ఎక్కి ఆశ్రయం పొందినట్లు గుర్తించిన బృందాలు, సాహసోపేతంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి అతడిని కూడా క్షేమంగా కిందకు దింపాయి.
ఆసుపత్రికి తరలింపు
రెస్క్యూ చేసిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి ప్రాథమిక చికిత్స అనంతరం, సత్తుపల్లి పోలీసులు మెరుగైన వైద్యం కోసం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారందరి ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు వెళ్లి తమ ప్రాణాలను పణంగా పెట్టిన సిబ్బంది అందరూ క్షేమంగా బయటపడటంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: కాంగ్రెస్ సీఎంలను హైకమాండ్ కించ పరుస్తుందా? కనీస గౌరవం కూడా ఇవ్వదా?
అందరూ క్షేమంగానే
ఐదుగురు మత్స్యకారులను కాపాడటానికి 10 ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానికుడు ఒకరు రాత్రి 7.30 గంటలకు రెండు బోట్లలో బయలుదేరారు. సిబ్బందిలో ఆరుగురు కొత్తగూడెం బెటాలియన్‌కు చెందిన పోలీసులు, మిగిలిన నలుగురు అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు. సిబ్బంది పడవలు వరద ఉద్ధృతికి బోల్తా పడడంతో అలుగునీటిలో గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో కొందరు ఒకేచోట ఉన్నారని, తమతో ఫోన్లో మాట్లాడారని జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి అజయ్‌కుమార్ పేర్కొన్నారు. రాత్రి 2.15 గంటలకు ఒకరిని, రాత్రి 3.00 గంటలకు నలుగురిని రక్షించారు. మిగిలిన వారిని సైతం గుర్తించి రక్షించారు. కలెక్టర్ రాత్రి 3 గం.ల వరకు ఘటనాస్థలంలో ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు.
అంతకుముందు వరదలో చిక్కుకున్న ఐదుగురు మత్స్యకారులు ఓ మట్టి దిబ్బపైకి వెళ్లారు. నీళ్లు కాళ్ల వరకు వచ్చేయడంతో ఒకరికొకరు చేతులు పట్టుకొని సహాయం కోసం వేడుకున్నారు. రాత్రి 10.30 గంటలకు విజయవాడకు చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందం వీరి వద్దకు చేరుకుని, రాత్రి 11.20 గంటలకు క్షేమంగా బయటకు తీసుకొచ్చింది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరా తీశారు.
Also Read: ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు చివరి తేదీ నవంబర్ 6.. పట్టభద్రుల ఓట్లపై కాంగ్రెస్ ఫోకస్!

