Purple Potato: నార్మల్ గా బంగాళదుంపలు పసుపు రంగులో ఉంటాయి. కానీ, పర్పుల్ రంగులో ఉండే బంగాళదుంపలు ఎప్పుడైనా చూశారా? మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ బంగాళదుంపలు తినొచ్చా?

ఎక్కువ మంది ఇష్టపడే కూరగాయల్లో బంగాళదుంపలు ముందు వరసలో ఉంటాయి. చాలా మందికి ఏ కూర వండినా అందులో బంగాళదుంప పడాల్సిందే. అయితే, మనం రోజూ తినే బంగాళదుంపలు సాధారణ పసుపు రంగులో ఉంటాయి. కానీ, పర్పుల్ కలర్ పొటాటోలను ఎప్పుడైనా చూశారా? ప్రస్తుతం మార్కెట్లో ఈ కొత్త రంగు బంగాళదుంపలు సందడి చేస్తున్నాయి.

నార్మల్ బంగాళదుంపలు మన కడుపు నింపుతాయి. కానీ, శరీరానికి కావాల్సిన పూర్తి స్థాయి పోషకాలను అందించలేవు. అందుకే, ఈ పోషకాహార లోపానికి పరిష్కారంగా, భారత ప్రభుత్వ వ్యవసాయ శాస్త్రవేత్తలు ఒక అద్భుతాన్ని సృష్టించారు. అదే ఈ పర్పుల్ పొటాటో.. దీనిని కుఫ్రి జుమానియా అని పిలుస్తారు. మరి, వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?

భారత వ్యవసాయ పరిశోధన మండలి కి చెందిన ‘ కేంద్ర బంగాళదుంప పరిశోధన సంస్థ ఈ ప్రత్యేక రకాన్ని రూపొందించింది. సాధారణ బంగాళదుంపతో పోలిస్తే ఇందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి.

ఐరన్ : సాధారణ బంగాళాదుంపలో కేవలం 0.57 మి.గ్రా ఇనుము ఉంటే... ఈ ఊదా బంగాళాదుంపలో ఏకంగా 3.22 మి.గ్రా ఉంటుంది. అంటే ఇది రక్తహీనతను 5 రెట్లు వేగంగా నయం చేస్తుంది.

విటమిన్ సి : సాధారణ పొటాటోలో 23.15 మి.గ్రా విటమిన్ సీ ఉంటే, కుఫ్రి జమునియాలో 42.75 మి.గ్రా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని రెట్టింపు చేస్తుంది.

జింక్ : సాధారణ దుంపల కంటే ఇందులో జింక్ (2.28 మి.గ్రా) చాలా ఎక్కువ. ఇది పిల్లల ఎముకల బలానికి, మెదడు ఎదుగుదలకు ఎంతో అవసరం.

న్యాచురల్ యాంటీఆక్సిడెంట్లు: దీని ఊదా రంగుకు కారణం 'ఆంథోసయనిన్స్' అనే ప్రత్యేక సమ్మేళనం. ఇది క్యాన్సర్, గుండె జబ్బుల వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించే నాచురల్ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.

తక్షణ శక్తిని ఇచ్చే పర్పుల్ బంగాళదుంప..

ఈ ఊదా రంగును చూసి ఇందులో ఏమైనా కెమికల్స్ లేదా రంగులు కలిపారేమో అని భయపడాల్సిన పనిలేదు. 'బయోఫోర్టిఫికేషన్' అనే వినూత్న సాంకేతికత ద్వారా ఈ పోషకాలన్నింటినీ విత్తనంలోనే సహజంగా అభివృద్ధి చేశారు. 2024లో అధికారికంగా విడుదలైన ఈ రకం పూర్తిగా సురక్షితమైనది. దీనిని తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.

రైతులకు కూడా ఈ కొత్త రకం బంగాళాదుంప ఎంతో లాభదాయకంగా మారింది. ఒక హెక్టారుకు సాధారణంగా 32-35 టన్నుల దిగుబడి వస్తుందనుకుంటే... ప్రయోగాల్లో ఏకంగా 49 టన్నుల దిగుబడి నమోదైంది. పంటలో దాదాపు 90% దుంపలు మార్కెట్‌లో మంచి ధరకు అమ్ముడయ్యే నాణ్యతతో ఉన్నాయి. సాధారణ బంగాళదుంప తో పోలిస్తే.. ఈ పర్పుల్ బంగాళదుంప ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. తొందరగా పాడవ్వవు. అయితే.. ఇవి ఇంకా.. దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రాలేదు. రైతులు వీటిని పండించడానికి ఇంకాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.