BGMI Air Launch Date Confirmed: భారత మొబైల్ గేమింగ్ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) లైటర్ వెర్షన్ ‘BGMI Air’ అధికారిక లాంచ్ డేట్‌ను డెవలపర్ క్రాఫ్టన్ ఇండియా (KRAFTON India) ప్రకటించింది. డిసెంబర్ 10, 2026న ఈ సరికొత్త గేమ్ భారత్‌లో విడుదల కానుంది. అధికారిక రిలీజ్ డేట్ ఖరారు కావడానికి ముందే గూగుల్ ప్లే స్టోర్‌లో ఏకంగా 14 మిలియన్ల (1.4 కోట్లు) ప్రీ-రిజిస్ట్రేషన్లను దాటేసి ఈ గేమ్ రికార్డు సృష్టించింది. ఎంట్రీ లెవల్ హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లు, తక్కువ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న స్మార్ట్‌ఫోన్లలో కూడా అసలైన బ్యాటిల్ రాయల్ అనుభవాన్ని అందించే లక్ష్యంతో క్రాఫ్టన్ ఈ గేమ్‌ను డిజైన్ చేసింది.

BGMI Air ప్రత్యేకతలు

ఈ గేమ్ ప్రారంభ డౌన్‌లోడ్ సైజు దాదాపు 1GB మాత్రమే ఉంటుంది. తక్కువ ర్యామ్, స్టోరేజ్ ఉన్న ఫోన్లలోనూ ఎలాంటి లాగ్ లేకుండా సులువుగా రన్ అవుతుంది. ముఖ్యంగా ఇది పూర్తిగా ప్రత్యేకమైన యాప్‌గా పని చేస్తుంది. ఇప్పటికే రెగ్యులర్ BGMI ఆడుతున్న క్రీడాకారులు తమ పాత అకౌంట్లను ఎలాంటి మైగ్రేషన్ లేదా రీ రిజిస్ట్రేషన్ లేకుండానే BGMI Airలో నేరుగా ఉపయోగించుకోవచ్చు.

డిసెంబర్‌లో అధికారికంగా మార్కెట్‌లోకి తీసుకురావడానికి ముందే గేమ్ పనితీరును పరీక్షించి, ఆప్టిమైజ్ చేసేందుకు క్రాఫ్టన్ ఒక క్లోజ్డ్ బీటా టెస్టింగ్‌ను నిర్వహించనుంది. నవంబర్ 20 నుండి నవంబర్ 24, 2026 వరకు ఈ టెస్టింగ్ జరుగుతుంది. గేమ్ పనితీరుపై యూజర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరించేందుకు ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి ఎంపిక చేసిన నగరాల్లో ఈ టెస్టింగ్ ఫేజ్ అందుబాటులో ఉంటుంది.

ఈ క్లోజ్డ్ బీటా టెస్టింగ్‌లో భాగం కావాలనుకునే గేమర్లు ఒక షార్ట్ వీడియోను రూపొందించాలి. అందులో తాము ఎందుకు ఈ టెస్టింగ్‌కు ఎంపిక కావాలనుకుంటున్నారో వివరిస్తూ.. అధికారిక BGMI హ్యాండిల్‌ను ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా (@battlegroundsmobilein_official) ద్వారా అందించిన అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి చేయాలి. లాంచ్‌కు ముందు నిర్వహించబోయే ప్రీ-లాంచ్ ఈవెంట్లు, క్రీడాకారులకు అందించే ప్రత్యేక రివార్డులకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక కమ్యూనిటీ ఛానల్స్ ద్వారా త్వరలోనే వెల్లడిస్తామని పబ్లిషర్ క్రాఫ్టన్ స్పష్టం చేసింది.