BJP AP Municipal Elections Vote Transfer Issues:  ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పోరులో అధికార ఎన్డీయే కూటమి  నమోదు చేసిన విజయం చారిత్రాత్మకం. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు ,  నగర పంచాయతీలతో కూడిన పురపాలక క్షేత్రంలో కూటమి హవా స్పష్టంగా కనిపించింది. ఈ తిరుగులేని విజయానికి మూలస్తంభం— మూడు పార్టీల అగ్రనాయకత్వం నుంచి క్షేత్రస్థాయి శ్రేణుల వరకు ప్రదర్శించిన తిరుగులేని ఐక్యత. సార్వత్రిక ఎన్నికల నాటి కలయిక కేవలం ఒక రాజకీయ అవకాశవాద పొత్తు మాత్రమే కాదని, అది ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టే బలమైన భావజాల బంధమని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయి.

కూటమి ఓట్ల బదిలీ సక్సెస్ 

ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి సోషల్ మీడియా వేదికగా ఇతర పార్టీలు తీవ్రస్థాయిలో మైండ్ గేమ్‌కు దిగాయి.  జనసేన శ్రేణులు తీవ్ర నిరాశతో ఉన్నాయి, కూటమి పొత్తుపై జనసైనికుల్లో అసంతృప్తి నెలకొంది, ఆ ఓట్లు వైఎస్సార్‌సీపీ వైపు మళ్లుతాయి అంటూ రకరకాల ఫేక్ నెరేటివ్‌లు వ్యాప్తి చేసే ప్రయత్నాలు జరిగాయి. కానీ, టీడీపీ-జనసేన నేతలు, క్షేత్రస్థాయి శ్రేణులు ఈ కుట్రలను ఇట్టే పసిగట్టారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో టీడీపీ ఓటు బ్యాంక్ జనసేనకు, జనసేన ఓటు బ్యాంక్ టీడీపీకి  పక్కకు పోకుండా   అత్యంత పకడ్బందీగా బదిలీ అయిపోయింది.

అనంతపురం బీజేపీ మేయర్ అభ్యర్థి ఓటమి 

అయితే, ఈ ఘనవిజయం విజయోత్సవాల నడుమ ఒక స్పష్టమైన ప్రతికూల కోణం కూడా స్పష్టమవుతోంది. పొత్తులో భాగంగా కమలదళానికి  కేటాయించిన స్థానాల్లో మాత్రం ఓట్ల బదిలీ అనుకున్నంత సాఫీగా జరగడం లేదన్న సత్యం మళ్లీ బయటపడింది. రాష్ట్రంలో బీజేపీకి ఉన్న సొంత ఓటు బ్యాంక్ పరిమితమైనది కావడం ఒకెత్తయితే.. ఆ పార్టీ పోటీ చేసిన స్థానాల్లో టీడీపీ, జనసేన శ్రేణులు తమ శక్తినంతా ధారపోసి పూర్తిస్థాయిలో తమ ఓట్లను కమలానికి వేయించలేకపోతున్నాయి. కేడర్ స్థాయిలో బీజేపీతో ఉన్న కొంత సహజ సిద్ధమైన అంతరం దీనికి కారణమని భావిస్తున్నారు. అనంతపురం మేయర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు.  తిరుపతి లోక్ సభ స్థానంలోనూ ఇదే తరహా ఫలితం వచ్చింది.  కూటమిగా   అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యతలు సాధించినప్పటికీ, బీజేపీ అభ్యర్థి  మాత్రం ఎంపీగా ఓడిపోయారు.  అనంతపురంలో మెజారిటీ డివిజన్లను టీడీపీ, జనసేన గెలుచుకుని కార్పొరేషన్‌పై పట్టు సాధించినప్పటికీ, మేయర్ పీఠం దక్కాల్సిన కమలదళ అభ్యర్థి స్థానంలో హోరాహోరీ నడుమ అనూహ్య సమీకరణాలు చోటుచేసుకోవడం లేదా గట్టిపోటీ ఎదురవ్వడం కూటమి నియోజకవర్గ స్థాయి సమన్వయ లోపాన్ని ఎత్తిచూపుతోంది.

బీజేపీ బాధ్యతలు పూర్తిగా తీసుకోవాల్సిందే!

టీడీపీ-జనసేన శ్రేణుల మధ్య ఏ స్థాయిలో సహజ సిద్ధమైన స్నేహం, ఓటు బదిలీ సులువుగా జరిగిపోతోందో.. బీజేపీ విషయానికి వచ్చేసరికి వార్డు స్థాయిల్లో ఆ స్థాయిలో ఓటర్లను పోలింగ్ బూతు దాకా తీసుకెళ్లే నాథుడు కరువవుతున్నాడు.  మా పార్టీ గుర్తు కాకపోవడం , బీజేపీ స్థానిక నాయకత్వాలు కేడర్‌తో కలవకపోవడం, లేదా సమన్వయ సమావేశాల పరిమిత నిర్వహణ వల్ల కమలం గుర్తుపై పోటీ చేసిన చోట సాధారణ ఓటరు కాస్త వెనకడుగు వేస్తున్నాడనేది వాస్తవం. ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీడీపీ-జనసేనల బలమైన బంధానికి, పట్టణ ఓటర్ల తీర్పుకు సాక్ష్యంగా నిలిచాయి. కానీ ఎన్డీయే కూటమి సమగ్ర విజయాన్ని భవిష్యత్తు సార్వత్రిక సమరాల దాకా నిలబెట్టుకోవాలంటే.. బీజేపీతో ఉన్న ఓటు బదిలీ లోపాలను తక్షణమే సరిదిద్దుకోవాలి. కేవలం అగ్రనేతల కరచాలనానికే పరిమితం కాకుండా, వార్డు స్థాయిలోనూ బీజేపీ అభ్యర్థులకు టీడీపీ-జనసేన తమ సొంత అభ్యర్థుల తరహాలోనే ఓట్లు వేయించగలిగినప్పుడే కూటమి విజయం నూటికి నూరు శాతం సంపూర్ణమవుతుంది.