Virat Kohli Birthday: భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఆటగాడు విరాట్ కోహ్లీ. నవంబర్ 5, 1988న ఢిల్లీలో జన్మించిన ఈ స్టార్ క్రికెటర్‌కు నేడు (నవంబర్ 5) పుట్టినరోజు. 38వ పుట్టినరోజు జరుపుకుంటున్న కింగ్ కోహ్లీ గురించి అభిమానులకు తెలిసింది చాలా తక్కువే. అతడి క్రికెట్ ప్రయాణంలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు దాగి ఉన్నాయి.

Virat Kohli Child Days

1. తొమ్మిదేళ్ల వయసులోనే క్రికెట్ అకాడమీలో అడుగు: కోహ్లీకి చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ప్రాణం. 1998 మే 30న వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీ ప్రారంభమైన తొలిరోజే తన తండ్రి ప్రేమ్ కోహ్లీ, సోదరుడు వికాస్‌తో కలిసి అక్కడికి వెళ్లాడు. ఆ రోజు సుమారు 250 మంది పిల్లలు అకాడమీలో చేరగా.. వారిలో చీకూ కూడా ఒకడు. అతడి కోచ్ రాజ్‌కుమార్ శర్మకు మొదట ఆకట్టుకున్నది బ్యాటింగ్ కాదు.. బౌండరీ లైన్ దగ్గర నుంచి అతడు విసిరిన అద్భుతమైన త్రో!

Virat Kohli Birth Day (1)

2. చిన్న వయసులోనే సీనియర్లతో ఆడాలని పట్టుబట్టేవాడు..: తన వయసు పిల్లలతో ఆడటం కోహ్లీకి నచ్చేది కాదు. జూనియర్ ఆటగాళ్లకు తనను ఔట్ చేయడం కష్టంగా మారడంతో సీనియర్ గ్రూపులో ఆడేందుకు కోచ్‌ను పదేపదే అడిగేవాడు. పెద్దవాళ్లతో ఆడుతున్న సమయంలో ఛాతీకి బంతి తగిలినా వెనక్కి తగ్గలేదు. ఆ పట్టుదలే అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది.

Virat Kohli Birth Day Special (2)

3. పాలవాడి సైకిల్‌పై ప్రయాణం.. కోచ్‌కు తెలిసినా..: కోహ్లీ చిన్నతనంలో అకాడమీలో ఐదు కిలోమీటర్ల రన్నింగ్ సెషన్లు ఉండేవి. అయితే పరుగు పందెంలో ముందుండేందుకు అప్పుడప్పుడు పాలవాడి సైకిల్‌పై ప్రయాణించి ముందుకు వెళ్లేవాడట. ఈ విషయాన్ని అతడి చిన్ననాటి స్నేహితుడు వెల్లడించాడు. కోచ్‌కు విషయం తెలిసినా.. కోహ్లీ ముందుండటం చూసి సంతోషించేవారని చెప్పడం విశేషం.

Virat Kohli Birth Day Special

4. తండ్రి మరణించినా క్రికెట్‌ను వదల్లేదు..: 2006 డిసెంబర్‌లో కర్ణాటకతో రంజీ మ్యాచ్ ఆడుతున్న సమయంలో కోహ్లీ జీవితంలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అతడు 40 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. అదే రాత్రి అతడి తండ్రి ప్రేమ్ కోహ్లీ కన్నుమూశారు. అయినప్పటికీ మరుసటి రోజు మైదానంలోకి తిరిగి వచ్చిన విరాట్ 90 పరుగులు చేసి ఢిల్లీ జట్టును ఫాలోఆన్ ముప్పు నుంచి కాపాడాడు. ఈ సంఘటన అతడి మానసిక దృఢత్వానికి నిదర్శనంగా నిలిచింది.

Virat Kohli Birth Day Special (1)

5. చీకూ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?: ప్రపంచవ్యాప్తంగా కింగ్ కోహ్లీగా గుర్తింపు పొందిన విరాట్‌కు చిన్నతనంలో చీకూ అనే ముద్దుపేరు ఉండేది. ఢిల్లీ క్రికెట్‌లో కోచ్ అజిత్ చౌదరి అతడికి ఈ పేరు పెట్టారు. జుట్టు కత్తిరించుకున్న తర్వాత కార్టూన్ పాత్రలా కనిపించడంతో చీకూ అని పిలిచేవారని చెబుతారు.

Virat Kohli Birth Day

6. చిన్నప్పటి కలను స్క్రాప్‌బుక్‌లో రాసుకున్నాడు..: కోహ్లీ చిన్ననాటి స్నేహితుడు శలజ్ సోంధీ వెల్లడించిన మరో ఆసక్తికర విషయం ఉంది. స్నేహితులంతా తమ గురించి రాసుకునే స్క్రాప్‌బుక్‌లో విరాట్ 2002 లేదా 2003లోనే భారత క్రికెటర్ కావాలనే తన లక్ష్యాన్ని రాసుకున్నాడు. ఆ చిన్ననాటి కలను నిజం చేసుకోవడమే కాదు.. ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు.

Virat Kohli Career

7. తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో పెద్దగా రాణించలేదు..: 2008 ఆగస్టు 18న శ్రీలంకతో దంబుల్లాలో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్‌లో 33 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులే చేశాడు. కానీ ఆరంభ వైఫల్యంతో ఆగిపోకుండా అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు.

Virat Kohli (1)

8. 2012 తర్వాత మారిన కోహ్లీ ఫిట్‌నెస్ ప్రయాణం..: ప్రతిభ ఒక్కటే సరిపోదని గ్రహించిన కోహ్లీ తన శరీర సామర్థ్యం, ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. 2012 ఐపీఎల్ సీజన్ నిరాశ తర్వాత తన వర్క్ ఎథిక్, ఫిట్‌నెస్ విషయంలో కీలక మార్పులు చేసుకున్నాడు. ఆ తర్వాత మైదానంలో అతడి పరుగుల వేగంతో పాటు ఫిట్‌నెస్ కూడా యువ క్రికెటర్లకు ఆదర్శంగా మారింది.

Virat Kohli Child Family

చివరిగా..: చిన్నతనంలో సీనియర్లతో ఆడాలని పట్టుబట్టిన కుర్రాడు.. తండ్రిని కోల్పోయిన బాధను దిగమింగి మైదానంలో పోరాడిన యువకుడు.. నేడు కోట్లాది మంది అభిమానించే కింగ్‌గా ఎదిగాడు. కోహ్లీ కథలో రికార్డుల కంటే గొప్పది అతడి పట్టుదల. అందుకే అతడు కేవలం పరుగులు చేసే బ్యాటర్ కాదు.. లక్ష్యం కోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చని నిరూపించిన స్ఫూర్తి. హ్యాపీ బర్త్‌డే కింగ్ కోహ్లీ!