Virat Kohli 38th Birthday: రన్‌ మెషిన్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురువారం తన 38వ పుట్టినరోజు (38th birthday) జరుపుకుంటున్నాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన, రికార్డుల మోత మోగించిన ఒక అద్భుతమైన జర్నీలో విరాట్ మరో ఏట అడుగుపెట్టాడు. చేతిలో చిన్న BDM బ్యాట్ పట్టుకుని అండర్-19 (U19) రోజుల్లో అదరగొట్టిన కుర్రాడు.. ఇప్పుడు ‘MRF Genius’ బ్యాట్‌తో మైదానంలో ప్రత్యర్థులపై విరుచుపడుతూ క్రికెట్ ప్రపంచాన్నే షాక్‌కు గురి చేస్తున్నాడు. దాదాపు రెండు దశాబ్దాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో రికార్డులు, ట్రోఫీలు, మైలురాళ్లు, మధ్యలో కొన్ని ఫెయిల్యూర్స్, గుండెల్ని పిండేసే ఓటములు.. వీటన్నింటిని దాటుకుని అసాధారణమైన ఎలీట్ లెవెల్ స్పోర్ట్స్ పర్సన్ (elite-level sportsperson) గా ఎదిగాడు. ఇక, క్రికెట్ పిచ్చి ఉన్నవాళ్లకు విరాట్ జర్నీ ఒక సినిమా లాంటిదే..

డ్రెస్సింగ్ రూమ్‌లో అత్యంత పిన్న వయస్కుడిగా ప్రయాణం ప్రారంభించిన విరాట్, ఆ తర్వాత ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ (God of Cricket) సచిన్ టెండూల్కర్ స్థానాన్ని అత్యంత సమర్థవంతంగా భర్తీ చేశాడు. ప్రతీ షాట్‌తో రికార్డులను తిరగరాయడం, హెడ్‌లైన్స్‌లో నిలవడం ఒక ఎత్తైతే.. ఫామ్ కోల్పోయి పరుగుల కోసం తీవ్రంగా శ్రమించడం, మీడియా ఒత్తిడిని తట్టుకోవడం మరొక ఎత్తు. ఒక ఆటగాడు ఒకే సమయంలో ఎలా ‘సూపర్‌హ్యూమన్’ (Superhuman) గానూ, అలాగే ఒక సాధారణ మనిషి (Human) గానూ ఉండగలడో కోహ్లీ తన కెరీర్ ద్వారా ప్రపంచానికి నిరూపించాడు. ప్రస్తుతం తన కెరీర్ చివరి దశలో ఉన్న ‘కింగ్ కోహ్లీ’ (King Kohli) దృష్టి ఇప్పుడు 2027 వన్డే వరల్డ్ కప్ (World Cup), తన ఆరాధ్యదైవం సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న 100 శతాబ్దాల మైలురాయి, అలాగే మరికొన్ని ఐపీఎల్ (IPL) ట్రోఫీలపైనే ఉంది. వన్డే ఫార్మాట్‌లో ఇప్పటికీ అజేయమైన సూపర్‌స్టార్‌గా కొనసాగుతున్న కోహ్లీ ఖాతాలో రికార్డుల వర్షం కురుస్తూనే ఉంది. ఇక, 38వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న విరాట్ కోహ్లీకి చెందిన 38 ప్రత్యేకమైన రికార్డులు, స్టాటిస్టిక్స్ (Statistics) వివరాలు ఇప్పడు తెలుసుకుందాం..

డొమెస్టిక్, ఏజ్ గ్రూప్ క్రికెట్ (Domestic & Age-Group Cricket):

1. రంజీ ట్రోఫీ (Ranji Trophy) 2006-07 సీజన్ ద్వారా ఢిల్లీ తరఫున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసిన కోహ్లీ, 9 ఇన్నింగ్స్‌ల్లో 36.71 సగటుతో ఒక అర్ధశతాబ్దంతో సహా 257 పరుగులు చేశాడు. ఇందులో ఆయన అత్యుత్తమ స్కోరు 90.

2. విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) 2008-09 సీజన్‌లో ఢిల్లీ తరఫున 7 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 89.00 సగటుతో, 4 సెంచరీలతో 534 పరుగులు చేసి ఆ టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

3. ఢిల్లీ తరఫున ఆడిన తొలి ఇంటర్‌స్టేట్ టీ20 టోర్నమెంట్ / సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy) లో 5 ఇన్నింగ్స్‌ల్లో 35.80 సగటుతో ఒక ఫిఫ్టీతో 179 పరుగులు చేశారు.

4. అండర్-19 వరల్డ్ కప్ 2008 (U19 World Cup) విజేత భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ, 6 ఇన్నింగ్స్‌ల్లో ఒక సెంచరీతో 235 పరుగులు చేసి ఆ టోర్నమెంట్‌లో మూడో అత్యధిక రన్‌స్కోరర్‌గా నిలిచాడు.

5. భారత్ తరఫున యూత్ లెవెల్ (Youth Level)లో టెస్టులు, వన్డేలు కలిపి ఆడిన 40 మ్యాచ్‌ల్లో (44 ఇన్నింగ్స్‌లు) 4 సెంచరీలు, 12 అర్ధశతాబ్దాలతో మొత్తం 1,910 పరుగులు చేశాడు. ఇందులో 12 యూత్ టెస్టుల్లో 932 పరుగులు (3 సెంచరీలు, 6 ఫిఫ్టీలు), 28 యూత్ వన్డేల్లో 978 పరుగులు (1 సెంచరీ, 6 ఫిఫ్టీలు) ఉన్నాయి.

టెస్ట్ క్రికెట్ (123 మ్యాచ్‌లు, 9,230 పరుగులు, సగటు 46.85, 30 సెంచరీలు, 31 ఫిఫ్టీలు):

6. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే భారత కెప్టెన్‌గా అత్యధికంగా 7 డబుల్ సెంచరీలు (Double Tons) చేసిన రికార్డు కోహ్లీ పేరిటే ఉంది.

7. కెప్టెన్‌గా ఆడిన 68 టెస్టుల్లో 54.8 సగటుతో 20 సెంచరీలు, 18 అర్ధశతాబ్దాలతో మొత్తం 5,864 పరుగులు సాధించాడు.
టెస్టుల్లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఇది నాలుగో స్థానం.

8. టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా 68 మ్యాచ్‌ల్లో 40 విజయాలు అందించాడు. భారత్‌కు అత్యధిక టెస్ట్ విజయాలు అందించిన నాయకుడు విరాట్.

9. తన కెప్టెన్సీలో సొంతగడ్డపై ఆడిన 11 టెస్ట్ సిరీస్‌లకు 11 సిరీస్‌లు గెలిచి 100% విజయవంతమైన రికార్డును నెలకొల్పాడు.

10. సొంతగడ్డపై కెప్టెన్‌గా ఆడిన 30 టెస్టుల్లో (46 ఇన్నింగ్స్‌లు) 70.02 అద్భుత సగటుతో 10 సెంచరీలు, 6 ఫిఫ్టీలతో 2,871 పరుగులు రాబట్టాడు.

11. సేనా (SENA – సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో 12 టెస్ట్ సెంచరీలు చేశాడు. సచిన్ టెండూల్కర్ (17) తర్వాత ఒక ఇండియన్ బ్యాటర్ చేసిన అత్యధిక సెంచరీలు ఇవే.

12. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో 7 సెంచరీలు బాదాడు. ఆస్ట్రేలియాలో అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆసియా బ్యాటర్‌గా కోహ్లీ చరిత్రకెక్కాడు.

13. టెస్టుల్లో సెకండ్ ఇన్నింగ్స్ (Second Innings)లో కోహ్లీ సగటు 61.78గా ఉంది. 53 టెస్టుల్లోని 52 ఇన్నింగ్స్‌ల్లో 15 సెంచరీలు, 5 ఫిఫ్టీలతో 3,151 పరుగులు చేశాడు.

14. టెస్టుల్లో థర్డ్ ఇన్నింగ్స్ (Third Innings) లో కోహ్లీ సగటు 35.98గా నమోదైంది. 58 టెస్టుల్లోని 57 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు, 10 ఫిఫ్టీలతో 1,871 పరుగులు సాధించాడు.

వన్డే క్రికెట్ (318 మ్యాచ్‌లు, 306 ఇన్నింగ్స్‌లు, 15,183 పరుగులు, 55 సెంచరీలు, 80 ఫిఫ్టీలు):

15. వన్డేల్లో ఛేజింగ్ (Chasing) చేస్తూ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. 180 మ్యాచ్‌ల్లోని 169 ఇన్నింగ్స్‌ల్లో 66.21 సగటుతో 30 సెంచరీలు, 46 ఫిఫ్టీలతో 8,741 పరుగులు చేశాడు.

16. భారత్ విజయం సాధించిన ఛేజింగ్ మ్యాచ్‌ల్లో 89.95 సగటుతో 25 సెంచరీలు, 30 ఫిఫ్టీలతో 6,477 పరుగులు సాధించాడు. వన్డే చరిత్రలో సక్సెస్ ఫుల్ ఛేజింగ్‌లో ఇవే అత్యధిక పరుగులు.

17. సేనా (SENA) దేశాల్లోనూ వన్డేల్లో 50 కంటే ఎక్కువ సగటు కలిగిన ఏకైక క్రికెటర్ కోహ్లీయే (సౌతాఫ్రికా- 76.38, ఇంగ్లాండ్- 51.48, న్యూజిలాండ్- 51.53, ఆస్ట్రేలియా- 50.03).

18. వన్డేల్లో ఓపెనర్ కాని బ్యాటర్‌గా అత్యధిక సార్లు (5 సార్లు) 150+ పరుగులు చేసిన రికార్డు కోహ్లీ సొంతం. ఈ ఐదు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ 820 సగటుతో 820 పరుగులు సాధించాడు.

19. సొంతగడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీయే. 133 మ్యాచ్‌ల్లో 62.81 సగటుతో 28 సెంచరీలు, 36 ఫిఫ్టీలతో 7,035 పరుగులు చేశాడు.

20. కోహ్లీ సాధించిన 55 వన్డే సెంచరీలలో ఏకంగా 45 సెంచరీలు భారత్ గెలిచిన మ్యాచ్‌ల్లోనే రావడం విశేషం. సచిన్ (33) రెండో స్థానంలో ఉన్నారు.

21. కోహ్లీ ఆడిన 10 దేశాల్లో 9 దేశాల్లో 50 ప్లస్ సగటును కలిగి ఉన్నాడు. కేవలం శ్రీలంకలో మాత్రమే విరాట్ సగటు 45.25గా ఉంది.

22. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఒకే వేదికపై అవుట్ కాకుండా అత్యధిక పరుగులు (338 పరుగులు) చేసిన రికార్డు సాధించాడు. ఇందులో 3 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు ఉన్నాయి.

టీ20 క్రికెట్ (430 మ్యాచ్‌లు, 14,218 పరుగులు):

23. టీ20 వరల్డ్ కప్‌లలో కోహ్లీ నాటౌట్‌గా నిలిచిన 8 మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ల్లో విరాట్ 6 అర్ధశతాబ్దాలతో 464 పరుగులు చేశాడు.

24. టీ20ల సక్సెస్‌ఫుల్ ఛేజింగ్‌లో 39 ఇన్నింగ్స్‌ల్లో 78.61 సగటు, 135.43 స్ట్రైక్ రేట్‌తో 16 ఫిఫ్టీలతో 1,561 పరుగులు సాధించాడు.

25. 2019లో ముంబైలో వెస్టిండీస్‌పై కేవలం 21 బంతుల్లోనే తన వేగవంతమైన టీ20 అర్ధశతాబ్దాన్ని పూర్తి చేశాడు.

26. 2016 ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌పై కేవలం 47 బంతుల్లోనే తన కెరీర్‌లోనే అత్యంత వేగవంతమైన టీ20 సెంచరీ సాధించాడు.

27. ఐపీఎల్ (IPL) చరిత్రలో వరుసగా 4 సీజన్లలో (2023 నుంచి 2026 వరకు) 600 ప్లస్ పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

28. 2019లో వెస్టిండీస్‌పై 29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో సాధించిన 70 పరుగుల ఇన్నింగ్స్ విరాట్ కెరీర్‌లోనే అత్యధిక స్ట్రైక్ రేట్ (241.38) కలిగిన టీ20 ఇన్నింగ్స్.

29. ఐపీఎల్ ఫైనల్, టీ20 వరల్డ్ కప్ ఫైనల్ రెండింటిలోనూ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ (Player of the Match) అవార్డు గెలుచుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు.

అంతర్జాతీయ క్రికెట్ (566 మ్యాచ్‌లు, 633 ఇన్నింగ్స్‌లు, 28,601 పరుగులు):

30. ఒక దశాబ్ద కాలంలో (2010-19) అన్ని ఫార్మాట్లు కలిపి 386 మ్యాచ్‌ల్లో 57.88 సగటుతో 69 సెంచరీలు, 98 ఫిఫ్టీలతో 20,960 పరుగులు చేశాడు. ఒక దశాబ్దంలో 20 వేల అంతర్జాతీయ పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ కోహ్లీనే.

31. క్రికెట్ చరిత్రలోనే అత్యధికంగా 10 ఐసీసీ అవార్డులు (ICC Awards) గెలుచుకున్న ఏకైక ఆటగాడు.

32. ఐసీసీ టోర్నమెంట్లలో అత్యధికంగా 3 ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ (Player of the Tournament) అవార్డులు (2014, 2016 టీ20 వరల్డ్ కప్స్, 2023 వన్డే వరల్డ్ కప్) సాధించిన రికార్డు ఉంది.

33. ఐసీసీ వైట్ బాల్ (ICC White-Ball) టోర్నమెంట్లలో ఆడిన 90 మ్యాచ్‌ల్లో 61.83 సగటుతో 6 సెంచరీలు, 33 ఫిఫ్టీలతో 3,834 పరుగులు చేశాడు. ఐసీసీ పరిమిత ఓవర్ల టోర్నీల్లో అత్యధిక పరుగులు, ఎక్కువ ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేసిన బ్యాటర్ కోహ్లీయే.

34. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో (ICC Knockout Matches) 22 మ్యాచ్‌ల్లో 51.2 సగటుతో ఒక సెంచరీ, 9 ఫిఫ్టీలతో 1,024 పరుగులు చేశాడు.

35. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-20 బ్యాటర్లలో అన్ని ఫార్మాట్లు కలిపి 50 కంటే ఎక్కువ సగటు ఉన్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ (52.86).

36. క్రికెట్ చరిత్రలో 50-ఓవర్ల వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మేస్ (Test Championship Mace), ఐపీఎల్ (IPL) టైటిల్స్ అన్నింటినీ గెలుచుకున్న ఏకైక ప్లేయర్ కోహ్లీ.

37. బంగ్లాదేశ్‌లోని షేర్-ఎ-బంగ్లా స్టేడియం (Sher-e-Bangla Stadium) లో 28 మ్యాచ్‌ల్లో 68.26 సగటుతో 4 సెంచరీలు, 8 ఫిఫ్టీలతో 1,297 పరుగులు చేశాడు.

38. ఆస్ట్రేలియా గడ్డపై అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లలో కలిపి 12 సెంచరీలు (టెస్టుల్లో 7, వన్డేల్లో 5) సాధించాడు విరాట్. ఆస్ట్రేలియాలో పర్యటించిన విదేశీ బ్యాటర్లలో ఇవే అత్యధికం.