న్యూఢిల్లీ, నవంబర్ 5: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే భారత్‌కు ఇరాన్ ఊరటనిచ్చింది. భారత్, చైనా, ఇరాక్, ఖతార్ దేశాలకు చెందిన వాణిజ్య నౌకలకు ఈ జలసంధి గుండా ప్రయాణించేందుకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఇరాన్ పార్లమెంటరీ కమిటీకి చెందిన ఓ కీలక సభ్యుడు వెల్లడించారు. భారత్ నుంచి మందుల సరఫరాలను సులభతరం చేయడం కూడా ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాల్లో ఒకటని తెలిపారు. ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిటీ డిప్యూటీ చైర్మన్ అమీర్ హయత్-మొఘద్దమ్ ఈ విషయాన్ని ఇరాన్ స్టూడెంట్స్ న్యూస్ ఏజెన్సీ (ISNA)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ నాలుగు దేశాల నౌకలు హార్ముజ్ జలసంధి గుండా స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని, అమెరికా కూడా వాటిని అడ్డుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.
భారత్‌కు మినహాయింపు ఎందుకు?
భారత్‌కు ఇచ్చిన మినహాయింపు వెనుక ప్రధానంగా మందుల సరఫరా అంశం ఉందని హయత్-మొఘద్దమ్ తెలిపారు. భారత్ నుంచి ఇరాన్‌కు అవసరమైన ఔషధాల దిగుమతులు సులభంగా జరిగేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. చైనా నౌకలకు మినహాయింపు ఇవ్వడం వెనుక ఆ దేశం నుంచి రాజకీయ మద్దతు పొందాలనే ఉద్దేశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ దౌత్య, ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే భారత, చైనా నౌకల నుంచి ఇరాన్ రవాణా రుసుములు వసూలు చేస్తున్నట్లు హయత్-మొఘద్దమ్ వెల్లడించారు. అయితే ఖతార్ నౌకలకు ఎలాంటి రుసుములు లేకుండా ప్రయాణించేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు, ఇతర దేశాల వాణిజ్య నౌకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. యూరోపియన్ యూనియన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నేవీ, హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల నుంచి గుర్తింపు వివరాలు, సరుకు, గమ్యస్థానానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించే విధానాన్ని ప్రవేశపెట్టింది. హార్ముజ్ జలసంధి భారత్ ఇంధన భద్రతకు అత్యంత కీలకమైన మార్గం. భారత్ తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. ఈ దిగుమతుల్లో సుమారు 30 శాతం ప్రస్తుతం హార్ముజ్ జలసంధి గుండా వస్తున్నట్లు సమాచారం. గతంలో భారత్ ముడి చమురు దిగుమతుల్లో దాదాపు 70 శాతం ఈ జలసంధి మార్గంపైనే ఆధారపడి ఉండేది. అయితే, ప్రస్తుతం రష్యా, అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, యూఏఈలోని ఫుజైరా వంటి ప్రాంతాల నుంచి చమురు కొనుగోళ్లను పెంచుకోవడం ద్వారా భారత్ తన సరఫరా మార్గాలను విస్తరించుకుంది.
ఇరాన్, ఒమన్ దేశాల మధ్య ఉన్న హార్ముజ్ జలసంధి.. పర్షియన్ గల్ఫ్‌ను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రంతో కలుపుతుంది. పశ్చిమాసియా దేశాల నుంచి ప్రపంచానికి సముద్ర మార్గంలో సరఫరా అయ్యే చమురులో దాదాపు నాలుగో వంతు ఈ మార్గం గుండానే రవాణా అవుతుంది. అందువల్ల ఇక్కడ నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడితే ప్రపంచ ఇంధన సరఫరాలు, వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో ప్రారంభమైన పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO) వివరాల ప్రకారం.. ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి ఆగస్టు వరకు వాణిజ్య నౌకలపై కనీసం 70 దాడులు నమోదయ్యాయి. ఈ దాడుల్లో 19 మంది నావికులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు మరణించిన 24 మంది భారతీయుల్లో 15 మంది నావికులు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధి గుండా భారత నౌకలకు మినహాయింపు లభించడంపై ప్రాధాన్యత ఏర్పడింది. ఇరాన్ ప్రకటించిన మినహాయింపులు భారతదేశానికి మందుల సరఫరాలు, వాణిజ్య నౌకాయానం విషయంలో కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది. అయితే, నౌకలపై ఆంక్షలు, రవాణా రుసుములు, పశ్చిమాసియా ఘర్షణల పరిణామాలు ఈ మార్గం ద్వారా జరిగే వాణిజ్యంపై ప్రభావం చూపనున్నాయి.

