హైదరాబాద్: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓటరు నమోదు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ క్రమంలో పట్టభద్రుల ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి తేదీగా ఎన్నికల అధికారులు ప్రకటించారు.
వరంగల్– ఖమ్మం– నల్గొండ, మహబూబ్నగర్– రంగారెడ్డి– హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి కొత్త ఓటర్ల జాబితా రూపొందిస్తున్నారు. అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుధర్శన్ రెడ్డి సూచించారు.
ఓటర్ల జాబితాపై CEO కీలక ప్రకటన
ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి తేదీ అయినప్పటికీ.. ఆ తర్వాత కూడా దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉందని CEO స్పష్టం చేశారు. నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు, అభ్యర్థనలు స్వీకరిస్తారు. డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు.
అంతేకాదు.. డిసెంబర్ 30న తుది జాబితా ప్రచురించిన తర్వాత కూడా నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.
ఇప్పటికే గతంలో పట్టభద్రుల ఓటర్లుగా నమోదైన వారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో తెలంగాణ CEO వెబ్సైట్ ద్వారా లేదా సంబంధిత ఎన్నికల అధికారులకు నేరుగా ఫారం-18 సమర్పించవచ్చు.
పట్టభద్రుల ఓట్లపై కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహం
మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఓటరు నమోదును రాజకీయంగా కీలకంగా భావిస్తోంది. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఓటర్ల నమోదుపై దృష్టి సారిస్తోంది. అర్హులైన పట్టభద్రులను గుర్తించడం, వారితో దరఖాస్తులు చేయించడం, ఓటరు నమోదుపై అవగాహన కల్పించడం వంటి అంశాలపై పార్టీ శ్రేణులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా యువత, ఉద్యోగులు, నిరుద్యోగ పట్టభద్రులు, విద్యావంతులను ఓటర్లుగా నమోదు చేయించడం ద్వారా ఎన్నికల సమయానికి బలమైన ఓటు బ్యాంకును సిద్ధం చేసుకోవాలన్నది కాంగ్రెస్ రాజకీయ లక్ష్యంగా కనిపిస్తోంది.
Also Read: MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల మద్దతుపై కాంగ్రెస్ ఫోకస్.. రేవంత్ వ్యూహం ఏంటి?
రెండు స్థానాలు.. కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకం!
మహబూబ్నగర్– రంగారెడ్డి– హైదరాబాద్ నియోజకవర్గం నుంచి సామ రామ్మోహన్ రెడ్డి, వరంగల్–ఖమ్మం–నల్గొండ నియోజకవర్గం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియలో కాంగ్రెస్ ఎంత చురుగ్గా వ్యవహరిస్తుంది? పార్టీ శ్రేణులు ఎంతమంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయిస్తాయి? నమోదు అయిన ఓట్లు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఎంతవరకు కలిసివస్తాయి? అనేది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే ఓటర్ల నమోదుపై సాగుతున్న ఈ రాజకీయ పోరు రాబోయే రోజుల్లో మరింత వేడెక్కే అవకాశం ఉంది.

