గుడ్డులో ఉండే పోషకాలు:గుడ్డును పోషకాల ఖజానా అని పిలవచ్చు. ఇందులో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ, శరీరంలోని మొత్తం కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. గుడ్డులో విటమిన్ A, B2, B5, B6, B12, D, E, K పుష్కలంగా లభిస్తాయి. అలాగే సెలీనియం, ఫాస్పరస్, కాల్షియం, జింక్, ఫోలేట్, ఐరన్, హై క్వాలిటీ ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. శరీరానికి అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలు ఇందులో ఉండటం వల్ల దీనిని సంపూర్ణ ప్రోటీన్ వనరుగా పరిగణిస్తారు. రోజూ 2 గుడ్లు తినడం వల్ల కలిగే 5 ప్రధాన లాభాలు ఇవే..

మెదడును చురుగ్గా ఉంచుతుంది: రోజూ రెండు గుడ్లు తినడం వల్ల శరీరానికి కోలిన్ అనే ముఖ్యమైన పోషకం లభిస్తుంది. ఇది మెదడు అభివృద్ధికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఒక పెద్ద ఉడికించిన గుడ్డులో దాదాపు 147 మిల్లీగ్రాముల కోలిన్ ఉంటుంది. కాబట్టి రోజుకు రెండు గుడ్లు తింటే శరీరానికి అవసరమైన కోలిన్ చాలా వరకు అందుతుంది.

కళ్ళు, చర్మానికి రక్షణ:గుడ్లలో ల్యూటిన్,జియాక్సంతిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యలు, శుక్లాలు రాకుండా కాపాడతాయి. అలాగే ల్యూటిన్‌లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సూర్యుని హానికరమైన అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తాయి.

బరువు నియంత్రణలో సహాయపడుతుంది:గుడ్డులో ఉండే ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ వల్ల కడుపు ఎక్కువ సేపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీనివల్ల పదేపదే ఆకలి వేయడం తగ్గుతుంది. అతిగా తినడం నివారించబడుతుంది, తద్వారా బరువు అదుపులో ఉంటుంది.

బ్లడ్ షుగర్ కంట్రోల్:గుడ్లలో కార్బోహైడ్రేట్లు, చక్కెర చాలా తక్కువగా ఉండి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా పరిమిత పరిమాణంలో గుడ్లు తినవచ్చు. అల్పాహారంలో గుడ్లు తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండటంతో పాటు జీర్ణశక్తి, మెటబాలిజం మెరుగుపడతాయి.

గుండె ఆరోగ్యానికి మేలు:గుడ్డులోని విటమిన్ A, E, B2, B6, B12 రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా చూసి, గుండెపోటు వంటి ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇక్కడ ఒక విషయం గుర్తించుకోవాలి.. గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ లేదా డయాబెటిస్ సమస్యలు ఉన్నవారు రోజుకు ఎన్ని గుడ్లు తినాలనే విషయంలో తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.

