హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఢిల్లీ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధిస్తూనే, రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని డిమాండ్లు సైతం చేశారు. నీటిపారుదల ప్రాజెక్టుల అంశాలతో పాటు ఎల్‌నినో ప్రభావంపై చర్చించి కేంద్ర సహాయాన్ని కోరేందుకు న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో సీఎం రేవంత్‌రెడ్డి నేడు భేటీ కానున్నారు. ఆదివారం ఢిల్లీకి వెళ్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు తెలంగాణ నీటి ప్రయోజనాల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని నిలదీస్తారా లేక మౌనంగా తిరిగి వస్తారా అని హరీష్ రావు ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి చట్టబద్ధంగా దక్కాల్సిన 968 టీఎంసీల గోదావరి జలాల వినియోగానికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధిస్తామని ప్రధాని వద్ద స్పష్టమైన హామీ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
47 టీఎంసీల జలాల హైడ్రాలజీ క్లియరెన్స్ ఇప్పటికే పూర్తయి, కేవలం టీఏసీ (TAC) అనుమతి మాత్రమే రావాల్సి ఉన్న సమ్మక్క– సారక్క ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం (CWC) కొత్త మార్గదర్శకాల పేరుతో వెనక్కి పంపడంపై హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆమోద ప్రక్రియలో ఉన్న డీపీఆర్‌కు కొత్త మార్గదర్శకాలను వర్తింపజేయడం సరికాదని, కేంద్రం వద్ద రాష్ట్ర వాదనను వినిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పాత మార్గదర్శకాల ప్రకారమే సమ్మక్క– సారక్క డీపీఆర్‌ను ఆమోదించి, తక్షణమే టీఏసీ అనుమతి ఇప్పించాలని సూచించారు.
మరోవైపు, గోదావరి - కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టును తెలంగాణలోని ఇచ్చంపల్లి నుంచి కాకుండా ఏపీలోని పోలవరం నుంచి బనకచర్ల వరకు చేపడతామని ఏపీ సీఎం చంద్రబాబు విశాఖ సీఐఐ సదస్సుతో పాటు పలు వేదికలపై చేసిన ప్రకటనలను హరీష్ రావు ప్రస్తావించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుబట్టడం వల్లే ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ మీదుగా తమిళనాడులోని గ్రాండ్ అనికట్ వరకు డీపీఆర్ రూపొందించారని, దానికి తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక రాష్ట్రాల అనుమతులు కూడా వచ్చాయని ఆయన గుర్తు చేశారు.
ఇప్పుడు ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను పోలవరం - బనకచర్లకు మార్చే ప్రయత్నం జరుగుతోందని హరీష్ రావు ఆరోపించారు. గోదావరి - కావేరి అనుసంధాన ప్రాజెక్టును ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలని, తరలించే 148 టీఎంసీలలో తెలంగాణకు 50 శాతం అంటే 75 టీఎంసీల వాటా కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఈ 5 ప్రధాన డిమాండ్లపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీలు తీసుకురావాలని, లేనిపక్షంలో తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరో ప్రజా ఉద్యమం చేపడతామని హరీష్ రావు హెచ్చరించారు.
సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ డిమాండ్లు..
1. తెలంగాణకు హామీగా ఉన్న 968 టీఎంసీల గోదావరి జలాల వినియోగానికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులకు తక్షణమే కేంద్ర అనుమతులు సాధించాలి. పాత మార్గదర్శకాల ప్రకారమే సమ్మక్క– సారక్క ప్రాజెక్టు డీపీఆర్‌ను ఆమోదించి, అనుమతి ఇప్పించాలి.
2. గోదావరి - కావేరి అనుసంధాన ప్రాజెక్టును ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలి.
3. ఈ ప్రాజెక్టులో తెలంగాణకు 148 టీఎంసీల్లో 75 టీఎంసీల వాటా కేటాయించాలి.
4. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే పోలవరం - బనకచర్ల అలైన్‌మెంట్‌ను తీవ్రంగా వ్యతిరేకించాలి.

