ఎస్‌బీఐ క్లర్కు కొలువులు

47
sbi-new

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దాదాపు తొమ్మిది వేల క్లర్కుల (జూనియర్‌ అసోసియేట్స్‌) ఖాళీలతో ప్రకటన వెలువడింది. ఇటీవల రెండువేల పీవో పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చింది. ఇప్పుడు క్లర్కులు.

ఎస్‌బీఐ దేశవ్యాప్తంగా 8904 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులను (251 బ్యాక్‌లాగ్‌లతో కలిపి) భర్తీ చేయనుంది. వాటిలో తెలంగాణ రాష్ట్రంలో 425, ఆంధ్రప్రదేశ్‌లో 253 పోస్టులు ఉన్నాయి. నియామకాలను రాష్ట్రాల వారీగా చేపడతారు. అభ్యర్థులు ఏ రాష్ట్రానికైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఆ రాష్ట్రంలోనే రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు అక్కడి భాష (లోకల్‌ లాంగ్వేజి) పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం
ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలు, అభ్యర్థులు ఎంపిక చేసుకునే లోకల్‌ లాంగ్వేజిపై నిర్వహించే టెస్టు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ప్రిలిమ్స్‌ పరీక్షలో ప్రతిభ చూపే అభ్యర్థుల్లో పోస్టుల సంఖ్యకు 10 రెట్ల మందిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో సాధించిన మార్కులతో మెరిట్‌ లిస్ట్‌ తయారుచేస్తారు.

ఉమ్మడి ప్రిపరేషన్‌
ఎస్‌బీఐ పీఓ, క్లర్క్‌ పరీక్షలు రెండింటికీ కలిపి ఉమ్మడిగా ఒకటే ప్రిపరేషన్‌ సరిపోతుంది. పీఓకు ప్రిపేర్‌ అయితే క్లర్క్‌ పరీక్షకు సన్నద్ధమైనట్లే. ఎస్‌బీఐ పీఓ మెయిన్స్‌ పరీక్షలోని ప్రశ్నల స్థాయి ఎక్కువగా ఉంటుంది. ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధించినంత వరకు పెద్ద తేడాలు లేవు. దాదాపు ఒకేలా ఉంటున్నాయి. మెయిన్స్‌ పరీక్షలో మాత్రం రెండింటికీ చాలా భేదం ఉంటుంది. క్లర్క్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష జూన్‌ నెల చివరి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. అంటే రెండు నెలలకు పైగా సమయం ఉంటుంది. ఈలోగా ప్రిపరేషన్‌ పూర్తి చేయాలి. పీఓ, క్లర్క్‌ పరీక్షలు రెండింటిని రాస్తున్న అభ్యర్థులు మాత్రం జూన్‌ 8న నిర్వహించే పీఓ ప్రిలిమ్స్‌ నాటికి తమ ప్రిపరేషన్‌ పూర్తయ్యేలా ప్రణాళికను తయారు చేసుకోవాలి. రెండు పరీక్షలకు సంబంధించి గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రశ్నల స్థాయి పట్ల అవగాహన ఏర్పడుతుంది. ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులను కవర్‌ చేస్తూ, ఒక మోడల్‌ పేపర్‌ ప్రాక్టీస్‌ చేయాలి. దీని వల్ల పరీక్ష రాసే పద్ధతికి అలవాటు పడతారు. మొదటసారి పరీక్ష రాసే అభ్యర్థులకు ఇది చాలా అవసరం. మూడు లేదా నాలుగు నెలలు అంకితభావంతో శ్రమిస్తే దేశంలోని నెంబర్‌ వన్‌ బ్యాంక్‌లో ఉద్యోగం ఖాయం.

మొత్తం పోస్టులు: 8,904 (251 బ్యాక్‌లాగ్‌ ఖాళీలతో కలిపి)
అర్హత: ఏదైనా డిగ్రీ (డిగ్రీ చివరి సంవత్సరం/ చివరి సెమిస్టర్‌ అభ్యర్థులు కూడా అర్హులే)
వయసు: 01.04.2019 నాటికి 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, ఫీజు చెల్లింపునకు చివరి తేది: 03.05.2019
పరీక్ష: ప్రిలిమ్స్‌ -జూన్‌లో, మెయిన్స్‌ – జులైలో
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: తెలంగాణ – హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌.
ఆంధ్రప్రదేశ్‌ – చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
https://bank.sbi/careers/
https://www.sbi.co.in/careers/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here