బెంగళూరు బోణీ కొట్టేనా..?

44
RCBvsKKR

బెంగళూరు: అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పరిస్థితి. ప్రపంచస్థాయి బ్యాట్స్‌మెన్‌.. నాణ్యమైన ఆల్‌రౌండర్లు.. సమర్థులైన బౌలర్లు.. ఇలా అన్ని వనరులున్నా ఇంత వరకు గెలుపు రుచి చూడలేకపోయింది. ఎన్నో అంచనాలతో టోర్నీలో అడుగుపెట్టిన ఆ జట్టు ఇలా ఢీలా పడుతుండటం అభిమానులను కలవరపెడుతోంది. అయితే గత చరిత్రను పరిశీలిస్తే.. కచ్చితంగా గెలవాల్సిన సమయాల్లో ఆ జట్టు విజృంభించే తీరు అంతాఇంతా కాదు. అందుకే వరుస ఓటములతో అట్టడుగున ఉన్నప్పటికీ ఆర్సీబీ విషయంలో మిగతా జట్లు ఆచితూచి వ్యవహరిస్తుంటాయి. ఈ రోజు బెంగళూరు వేదికగా రాత్రి 8గంటలకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా బోణీ కొడుతుందో లేదో చూడాలి. మరి ఈ రెండు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి..?
ఇప్పటి వరకూ రెండు జట్లూ 23 మ్యాచుల్లో తలపడగా.. అందులో 14 సార్లు కోల్‌కతా, 9 సార్లు బెంగళూరు విజయాలు సాధించాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో కోల్‌కతా 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆల్‌రౌండర్‌ సునీల్‌నరైన్‌ తిరిగి జట్టులో చేరే అవకాశం ఉంది. బెంగళూరు ప్రమాదకర బ్యాట్స్‌మెన్‌ డివియర్స్‌ను అడ్డుకునేందకు కోల్‌కతా సునీల్‌ నరైన్‌ లేదా పీయూష్‌ చావ్లాను ప్రయోగించే అవకాశం ఉంది. మరో స్పిన్నర్‌ కుల్దీప్‌యాదవ్‌ బౌలింగ్‌లో మాత్రం డివిలియర్స్‌ మెరుగైన రికార్డు కలిగి ఉన్నాడు. లెఫ్టార్మ్‌ సిన్నర్ల బౌలింగ్‌లో ఏబీ 300 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. 2.2 బంతులకో బౌండరీ బాదేశాడు. ఫీల్డింగ్‌ విషయంలో బెంగళూరు చాలా ఘోరంగా విఫలమైంది. ఇప్పటి వరకూ అందివచ్చిన 19 క్యాచుల్లో 9 క్యాచులు నేలపాలు చేసింది. కాబట్టి బెంగళూరు ఫీల్డింగ్‌లో మెరుగుపడాల్సి ఉందని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here