మమత.. ప్రధాని రేసులో నిలిచేనా?

52
mamata-banerjee

ఆమె పుట్టింది ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో. 17 ఏళ్లకే తండ్రి కాలం చేశారు. అయినా కష్టపడి న్యాయవిద్యను పూర్తి చేశారు మమత. కాలేజీ విద్యను అభ్యసిస్తుండగానే కాంగ్రెస్‌కు అనుబంధంగా విద్యార్థి సంఘాన్ని స్థాపించి రాజకీయాలు ప్రారంభించారు. విద్యార్థి దశలోనే కాంగ్రెస్‌లో చేరిన మమత.. తన పనితీరుతో ఆ పార్టీ నాయకత్వం దృష్టిని ఆకర్షించారు. మమత పనితీరును నచ్చి కాంగ్రెస్‌ నాయకత్వం 1984 లోక్‌ సభ ఎన్నికల్లో జాదవ్‌పూర్‌ స్థానంలో నిలపగా.. కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి సోమనాథ్‌ ఛటర్జీ ఓడించి అందరి దృష్టిని ఆకర్షించారు. 29 ఏళ్లకే లోక్‌సభలో ప్రవేశించారు. ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికై రైల్వే మంత్రి వంటి కీలక పదవులు చేపట్టారు. తన డిమాండ్ల కోసం అలక, మొండితనం, దూకుడు అన్ని ఆమెకు మాత్రమే సొంతం.

మమతలోని దూకుడు తొలిసారి కేంద్ర మంత్రిగా నియమితులైనప్పుడే బయటపడింది. పీవీ నరసింహారావు మంత్రి వర్గంలో క్రీడల శాఖ సహాయ మంత్రిగా ఉన్న మమత.. తన ప్రతిపాదనలు తిరస్కరించారనే కారణంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్‌ నాయకత్వంపై తిరుగుబాటు ఎగురవేసిన మమత 1997లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పేరుతో సొంత పార్టీని స్థాపించారు. ఆ సమయం నుంచి ఆమె తన దూకుడును మరింత పెంచారు. తన పోరాటాలు, ఆందోళనలతో బంగాల్‌లోని లెఫ్ట్‌ ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. సింగూరు కార్ల పరిశ్రమ అయినా.. నందిగ్రామ్‌ ఆందోళన అయినా మమత చేసిన పోరాటం ఒక రకంగా కమ్యూనిస్ట్‌ కంచుకోట బంగాల్‌లో వామపక్షాలకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ స్థానంలో తృణమూల్‌ను నిలబెట్టింది. ఇదే తరహా రాజకీయంతో 2011లో బంగాల్‌లో 34 ఏళ్ల లెఫ్ట్‌పాలనకు తెరదించి తృణమూల్‌ను అధికారంలోకి తీసుకువచ్చారు. పాలనలో తన మార్కుతో 2016లో రెండో సారి బంగాల్‌లో అధికారంలోకి వచ్చారు. లెప్ట్‌ పార్టీని బంగాల్‌లో నామమాత్రపు పార్టీ చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో దేశమంతా భాజపా హవా వీస్తున్నా.. బంగాల్‌లో మొత్తం 42 సీట్లలో తృణమూల్‌ 34 సీట్లు సాధించడం వెనక కృషి అంతా మమతదే. అంటే కాంగ్రెస్‌, అన్నాడీఎంకే తర్వాత ఎక్కువ సీట్లు తృణమూల్‌వే.

ఐదేళ్ల ఎన్డీయే పాలనలో ప్రధాని మోదీతో ఢీ అంటే ఢీ అన్న మమత అనేక సార్లు తాను ఎంత మొండిఘటమో చాటుకున్నారు. మమతా బెనర్జీ కల ఎప్పటికైనా ప్రధాని పదవిని అధిష్టించడం. ఎన్నాళ్ల నుంచో ఊరిస్తున్న ఈ కలను నెరవేర్చుకునేందుకు ఎంతోకొంత వీలున్న అవకాశం తన ఎదుట నిలిచింది. గత కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు దేశ రాజకీయాల్లో ప్రస్తుతం ఆమె పోషిస్తున్న చురుకైన పాత్ర ఇదే చాటుతుంది. 2014 నాటి ఎన్నికల్లో మాదిరిగానే తృణమూల్ కాంగ్రెస్‌ ఇప్పుడు‌ తిరుగులేని శక్తి. గతంలో సాధించిన సీట్ల కంటే ఎక్కువ తమ ఖాతాలో పడతాయని ధీమాగా ఉన్నారు మమత. దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో పోల్చితే రాజకీయంగా పరిస్థితుల పరంగా ఎక్కువ అనుకూలతలు ఉన్నది మమతకే. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో మోదీ, అమిత్‌ షాలకు విమర్శలకు దూకుడుగా బదులిస్తున్నది కూడా ఆమే. అందుకే ఇటీవల మోదీకి వ్యతిరేకంగా వేదికపైకి వస్తున్న ప్రాంతీయ పార్టీల్లో మమతదే పై మెట్టు అవుతోంది. కోల్‌కతాకు వరుసకట్టి ఆమెతో సంప్రదింపులు జరపడం వెనుక మమత శక్తిని వారంతా గుర్తించడమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here