కోహ్లి పోరాటం వృథా

46
kohli

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (123; 95 బంతుల్లో 16×4, 1×6) అలవోకగా శతక్కొట్టినా అతడికి సరైన సహకారం లభించకపోవడంతో భారత్‌కు భంగపాటు తప్పలేదు. శుక్రవారం మూడో వన్డేలో ఆస్ట్రేలియా 32 పరుగుల తేడాతో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. ఓపెనర్లు ఖవాజా (104; 113 బంతుల్లో 11×4, 1×6), ఫించ్‌ (93; 99 బంతుల్లో 10×4, 3×6) చెలరేగడంతో మొదట ఆసీస్‌ 5 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. కోహ్లి అద్భుతంగా బ్యాటింగ్‌ చేసినా.. మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమవడతో ఛేదనలో భారత్‌ 48.2 ఓవర్లలో 281 పరుగులకే ఆలౌటైంది. కమిన్స్‌ (3/37), రిచర్డ్‌సన్‌ (3/37), జంపా (3/70) భారత్‌ను దెబ్బ తీశారు. ఖవాజాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. నాలుగో వన్డే ఆదివారం చండీగఢ్‌లో జరుగుతుంది.

బంతితో ఎక్కువ పరుగులే ఇచ్చినా జడేజా అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆసీస్‌ను కట్టడి చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు. వికెట్‌కీపర్‌ ధోనీతో కలిసి అతడు ప్రమాదకర మాక్స్‌వెల్‌ను రనౌట్‌ చేసిన తీరు అమోఘం. 42వ ఓవర్లలో జరిగిందిది. అప్పటికి మాక్స్‌వెల్‌ ధాటిగా ఆడుతున్నాడు. ఆ ఓవర్‌ ఆఖరి బంతిని మార్ష్‌ కవర్‌లో ఆడి రన్‌ కోసం పరుగెత్తాడు. ఐతే బంతిని అడ్డుకున్న జడేజా మెరుపు వేగంతో త్రో చేశాడు. ధోని బంతిని పట్టుకుని రనౌట్‌ చేయడానికి ప్రయత్నించి ఉంటే మాక్స్‌వెల్‌ తప్పించుకునేవాడేమో!. కానీ అతడు తెలివిగా బంతిని వికెట్ల మీదికి మళ్లించాడు. మాక్స్‌వెల్‌ నిష్క్రమించక తప్పలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here