గవర్నర్‌తో భేటీలో సీఎం కేసీఆర్‌

85
KCR

తెలంగాణ ప్రజల కోణంలో పాలనా సంస్కరణలను చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌కు తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు అత్యుత్తమ సేవలు అందించేలా తీర్చిదిద్దుతామని వివరించారు. ‘ప్రతి శాఖలోనూ ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేస్తాం. ఎవరైనా లంచాలు అడిగినా, సేవలు సరిగా అందించకున్నా సత్వర చర్యలు ఉంటాయి. దళారులు, లంచాల బెడద లేకుండా ప్రజలు నేరుగా సేవలు పొందేలా చేస్తాం. పౌరసేవలు అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి. అనుమతులు, ఇతర అంశాలకు సంబంధించి ఏ మాత్రం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. పాలనాపరమైన ఆటంకాలు లేకుండా అధికారిక వ్యవస్థలోనూ మార్పులు చేయబోతున్నాం. ప్రతి జిల్లాలో ఆరుగురు అధికారుల బృందానికే అన్ని బాధ్యతలు అప్పగించి, వారి ద్వారా సేవలందిస్తాం’ అని వివరించారు. ముఖ్యమంత్రి ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటల పాటు వీరి మధ్య సమావేశం జరిగింది. రాష్ట్రంలో చేపట్టనున్న పాలనా సంస్కరణల గురించి కేసీఆర్‌ ఆయనతో చర్చించారు. ‘‘అధికారంలోకి వచ్చిన వెంటనే పాలనా సంస్కరణలు చేపట్టాలని భావించాం. అధికారుల కొరత, ఇతర సమస్యలకు తోడు కొత్త జిల్లాలను ప్రారంభించడం వంటి కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఇప్పుడు సమయం ఆసన్నమయింది. ప్రజలకు అవినీతిరహిత సేవలు అందించడానికి వీలుగా కొత్త చట్టాలు చేయడంతో పాటు విధానాల్లో మార్పులకు పూనుకుంటున్నాం. రెవెన్యూ శాఖ ప్రజలందరికీ సంబంధం ఉండేది. ఇప్పటికే రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, కొత్త పాస్‌ పుస్తకాల పంపిణీ, సత్వర రిజిస్ట్రేషన్‌ వంటివి చేపట్టాం. ఇవి సంపూర్ణం కాలేదు. ఇంకా క్షేత్ర స్థాయి సమస్యలున్నాయి. ప్రధానంగా లంచాలు అడుగుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఒక్క రెవెన్యూయే గాక రాష్ట్రంలోని ఏ ఒక్క శాఖలోనూ అవినీతి ఉండరాదు. దీనికి అనుగుణంగా కొత్త చట్టాలు రూపొందించాలని నిర్ణయించాం. పట్టణాలకు, నగరాలకు సంబంధించి పురపాలక శాఖ ముఖ్యమైంది. దీనిలోనూ ఎన్నో సమస్యలున్నాయి. ప్రజలకు సేవలు, అనుమతులు, అభివృద్ధికి సంబంధించిన వాటికి జవాబుదారీ తనం ఉండాలి. ఇందుకోసం కొత్త పురపాలక చట్టాన్ని తేవాలనుకుంటున్నాం. దీనిపైనా కసరత్తు జరుగుతోంది. రెవెన్యూ, పురపాలక చట్టాలు దేశంలోనే ఆదర్శమైనవిగా పేరు పొందేలా వాటిని రూపొందిస్తున్నాం.

హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తితో సీఎం భేటీ
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం రాత్రి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌ను ఆయన నివాసంలో కలిశారు. గంట సేపు వీరి మధ్య సమావేశం జరిగింది. హైకోర్టు వసతులు, సౌకర్యాలు, న్యాయమూర్తుల నియామకాల వంటి అంశాల గురించి చర్చించినట్లు తెలిసింది. సీఎం మర్యాదపూర్వకంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని కలిశారని అధికారవర్గాలు వెల్లడించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here