పరువు హత్యలతో ముగిసిన ప్రేమ కథలెన్నో !

145
pranay

ప్రాణం మీద ఆశ లేకుంటే ప్రేమించు అని తల్లిదండ్రులు పిల్లలకి వార్నింగ్ ఇస్తున్నట్లు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి.. కన్నవాళ్ళే పిల్లల్ని చంపేస్తున్నారు.. పిల్లల ప్రేమల్ని అంగీకరించటం లేదు.. తమ కులం కాని వాళ్లను ప్రేమించారంటూ అమ్మాయిల గొంతు నులిమేస్తున్నారు..ముద్దుగా పెంచి మూర్ఖంగా చంపేస్తున్నారు.ఆమధ్య ప్రణయ్ హత్య జరిగినప్పటి నుండి పరువు హత్యలు చాలా ఎక్కువయ్యాయి.. తాళ్లూరు మండలం కొత్తపాలెం గ్రామంలో ఆదివారం రాత్రి ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది..

కొత్తపాలెం గ్రామానికి చెందిన కోట వెంకారెడ్డి తన కుమార్తె వైష్ణవి(20) వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమిస్తోందని తెలిసి ఆమెకు నచ్చచెప్పాడు..ఐనా ఆమె చెప్పిన మాట వినకపోవడంతో కోపంతో ఆదివారం రాత్రి ఆమెను గొంతు నులిమి చంపేశాడు.కుమార్తె గుండెపోటుతో మృతి చెందిందని బంధువులు, గ్రామస్థులను నమ్మించే ప్రయత్నం చేశాడు.ఒంటిపై గాయాలు, గొంతు నులిమిన ఆనవాళ్లను బట్టి ఆమె హత్యకు గురైందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. గ్రామ వీఆర్వో యలమందారావు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.సోమవారం ఉదయానికల్లా వైష్ణవి మృతి చెందిందన్న విషయం తెలిసిన వెంటనే కొందరు ప్రజలు తరలి వచ్చి విచారం వ్యక్తం చేశారు.తర్వాత ఆ యువతి హత్యకు గురైందని తెలిసి నివ్వెరపోయారు. కన్న కూతుర్ని తండ్రే చంపటం ఏమిటంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

వైష్ణవి ఒంగోలులో బీకాం చదువుతోంది. లింగసముద్రం గ్రామానికి చెందిన తన తోటి విద్యార్థిని వైష్ణవి ప్రేమించింది.. వైష్ణవి రోజూ తమ ఊరి నుంచి బస్సులో కళాశాల కు వస్తుంటుంది. అతడు ఒంగోలులోనే ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్నాడు. రెండేళ్ల కిందటే వీరు ప్రేమలో పడినట్లు చెబుతున్నారు. ఏడెనిమిది నెలల క్రితం వీరి వ్యవహారాన్ని గమనించిన కళాశాల యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో వైష్ణవి తల్లిదండ్రులు ఆమెను మందలించారు. గత నెల 31వ తేదీన ఇంటి నుంచి కళాశాలకని బయలుదేరిన వైష్ణవి ఇంటికి చేరలేదు. దీంతో ఆందోళనకు గురైన ఆమె తల్లిదండ్రులు ఒంగోలులోని కళాశాల వద్దకు వచ్చి విచారించారు. తర్వాత ఆమె ఆచూకీని గుర్తించి ఇంటికి తీసుకొచ్చారు. కుమార్తెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆ విద్యార్థిని కూడా అతడి తండ్రి ఇంటికి తీసుకెళ్లిపోయారు. మళ్లీ ఒక్కరోజు వ్యవధిలోనే వైష్ణవి ఇంటి నుంచి అదృశ్యమైంది. ఫోన్‌ ద్వారా తన ప్రేమికుడికి సమాచారం ఇచ్చి మార్కాపురం వెళ్లింది. అతడొచ్చే లోపు బస్టాండులో ఒంటరిగా కనిపించిన వైష్ణవిని పోలీసులు గుర్తించి విచారించారు. విషయం తెలుసుకుని ఆమె తల్లిదండ్రుల్ని పిలిపించి వారికి అప్పగించినట్లు సమాచారం. ఇంటికి చేరిన తర్వాత ఈ విషయంపై తండ్రీ కూతుళ్ల మధ్య వాగ్వివాదం తీవ్రమైంది. ఆ ఘర్షణే హత్యకు దారి తీసింది. దీనిపై తాళ్లూరు ఎస్‌ఐ దాచేపల్లి రంగనాథ్‌ కేసు నమోదు చేశారు. దర్శి సీఐ శ్రీనివాసరావు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమ వ్యవహారాల్లో యువతులు దారుణ హత్యలకు గురవుతున్నారు. గతంలో తాళ్లూరు మండలంలోనే ఇటువంటి సంఘటనలు మూడు జరిగాయి. సుమారు అయిదేళ్ల క్రితం ఇదే మండలంలోని మాధవరం గ్రామంలో పరువు హత్య జరిగింది. మేనమామను పెళ్లి చేసుకోకుండా వేరొక యువకుడిని ప్రేమించిన యువతిని ఆమె తండ్రి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా పూడ్చి పెట్టారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటకు పొక్కింది. పోలీసుల దృష్టికి వెళ్లటంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. హత్య చేసిన తండ్రిని అరెస్టు చేశారు.
నాలుగేళ్ల కిత్రం ఇదే మండలంలోని తూర్పు గంగవరం గ్రామంలో ప్రేమించిన నేరానికి ఒక యువతి హత్యకు గురైంది. ఇంట్లోనే నిద్రిస్తున్న యువతిని దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ తర్వాత ఉరికి వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. చివరకు ఈ విషయం బయటపడింది. ఈ కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు.

కొమరోలు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో నాలుగు నెలల క్రితం దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రకళ అనే యువతి అదే గ్రామానికి చెందిన ఒక యువకుడిని ప్రేమించింది. అప్పట్లో ఈ రెండు కుటుంబాలూ హైదరాబాద్‌లో ఉండేవి. ఈ విషయం తెలిసి ఆమెను ఇంటికి తీసుకొచ్చి నిర్బంధించారు. ఆమె మనసు మార్చే ప్రయత్నం చేశారు. కానీ ఆమె మొండికేసింది. తన ప్రేమను అంగీకరించలేదని అన్నపానీయాలు మానేసింది. దీంతో ఆమె తండ్రి ఆగ్రహించాడు. ఆమె గొంతు నులిమేశాడు. రాత్రికి రాత్రే మృతదేహాన్ని గ్రామం వెలుపలికి తీసుకెళ్లి ఆమె మంచం, దుస్తులతో సహా మృతదేహాన్ని కాల్చి బూడిద చేశాడు. అప్పట్లో ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది.

తమ బిడ్డలు ఇతర కులస్థులను ప్రేమించడాన్ని తల్లితండ్రులు పరువు తక్కువగా భావించడమే ఇలాంటి సంఘటనలకు కారణమవుతోంది. నాలుగు నెలల వ్యవధిలోనే జిల్లాలో ఈ తరహాలో రెండు దారుణాలు జరిగాయి. ప్రేమించిన నేరానికి ఆడపిల్లల బతుకుల్ని చిదిమేస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల పాటు పెంచిన తల్లిదండ్రుల ప్రేమ.. వాళ్ల ప్రేమను మాత్రం సహించటం లేదు. హత్యలకు తెగబడుతున్న తల్లిదండ్రులు సదరు ఘటనలకు సంబంధించి ఆధారాలను సైతం సమాధి చేస్తున్నారు. ఆనవాళ్లను కాల్చి బూడిద చేస్తున్నారు. ప్రతి సంఘటనలోనూ హత్యలను తప్పుదారి పట్టించి తాము తప్పించుకునే దారులు వెదుకుతున్నారు. కొమరోలు మండలం నాగిరెడ్డిపల్లి కేసులో అయితే బూడిద తప్ప మరే ఆనవాళ్లూ లేకుండా చేసేంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఆ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here