శాశ్వత ధ్రువీకరణ పత్రాలు కెసిఆర్

11
hyd-main3a_23

తెలంగాణలో అవినీతి నిర్మూలనపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలుత ధ్రువీకరణ పత్రాల జారీ విధానాన్ని సంస్కరించాలని చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులపై అసంతృప్తితో ఉన్నారు. దీనికి సరైన పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. దీన్ని ప్రక్షాళన చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. ఎక్కడా ఏ దశలోనూ దరఖాస్తు దారులు డబ్బులివ్వాల్సిన పరిస్థితులు రానీయకూడదని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మాదిరిగా గాకుండా ప్రతి ధ్రువీకరణపత్రాన్ని శాశ్వతంగా జారీ చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అన్ని ధ్రువీకరణలకు ఒకే పత్రం; ఆధార్‌కు ధ్రువీకరణపత్రాల అనుసంధానం వంటివి పరిశీలనలో ఉన్నాయి. అనువైన విధివిధానాలను త్వరలో రూపొందించనున్నారు.

ప్రస్తుతం రెవెన్యూ కార్యాలయాల్లో కుల, ఆదాయ, నివాస, ఇతర వెనకబడిన తరగతులు (ఓబీసీ), ఆర్థికంగా వెనకబడిన తరగతులు (ఈబీసీ), వారసత్వం, సంపన్నశ్రేణి (క్రిమీలేయర్‌) ధ్రువీకరణపత్రాలు; ఆసుపత్రుల్లో శరీర సౌష్ఠవ (ఫిజికల్‌ ఫిట్‌నెస్‌), వైద్య ధ్రువీకరణపత్రాలు; సదరం శిబిరాల్లో దివ్యాంగ ధ్రువీకరణ; పురపాలక, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు; రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో వివాహాల నమోదు ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతున్నాయి. విద్య, ఉద్యోగాలు, ఎన్నికల్లో పోటీ, సంక్షేమ పథకాలకు ఇతర అవసరాలకు ధ్రువీకరణలు తప్పనిసరి. వీటి జారీ విధానం అవినీతికి ఆస్కారం కలిగించేదిగా ఉందని సీఎం భావిస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం వారం నుంచి 30 రోజుల గడువును ధ్రువీకరణపత్రాల జారీకి నిర్దేశించారు. గడువు ఎక్కువగా ఉండడం, విస్తృత పరిపాలన పరిధి వంటి అంశాల వల్ల ధ్రువీకరణపత్రాల జారీలో డబ్బులు చెల్లించాల్సి వస్తోందని పలువురు దరఖాస్తుదారులు ఫిర్యాదు చేస్తున్నారు. ఒక్కో ధ్రువీకరణపత్రానికి రూ.100 నుంచి రూ.వేయి వరకు ఇచ్చుకోవాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. జారీలో జాప్యం జరుగుతోందని వెల్లడిస్తున్నారు. సాంకేతిక ఇబ్బందులు, శాఖాపరమైన అంశాలు దీనికి కారణాలుగా రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here