రాఫెల్‌ డీల్‌ : సుప్రీంలో కేంద్రం అఫిడవిట్‌

106
rafaledeal

న్యూఢిల్లీ : రాఫెల్‌ ఒప్పందం వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వం సోమవారం సీల్డ్‌ కవర్‌లో సుప్రీం కోర్టుకు సమర్పించింది. ఒప్పందంలో ఏ భారత వాణిజ్య సంస్థ పేరును ప్రభుత్వం ఆఫ్‌సెట్‌ పార్టనర్‌గా సిఫార్సు చేయలేదని ఈ నివేదిక పేర్కొం‍ది. రాఫెల్‌ విమానాల కొనుగోలు ఒప్పందంపై పూర్తి వివరాలను పిటిషనర్‌తో పాటు ప్రజా బాహుళ్యానికి వెల్లడించాలని అక్టోబర్‌ 31న సుప్రీం కోర్టు కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు రాఫెల్‌ విమానాల కచ్చిత ధరను సైతం సుప్రీం న్యాయమూర్తులకు సమర్పించిన  సీల్డ్‌ కవర్‌ నివేదికలో కేంద్రం పొందుపరిచింది.

ఆఫ్‌సెట్‌ పార్టనర్‌ విషయంలో దసాల్ట్‌ ఏవియేషన్‌ నుంచి ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కాలేదని కేంద్రం సుప్రీం కోర్టుకు నివేదించింది. దీంతో ఈ ఒప్పందంలో రిలయన్స్‌ డిఫెన్స్‌ వాస్తవంగా ఎలాంటి పాత్ర పోషిస్తుందనే వివరాలను కేంద్రం అఫిడవిట్‌లో పొందుపరచలేదు. ఇక రాఫెల్‌ విమానాల సేకరణలో 2013 డిఫెన్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానాలను పాటించామని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.

విమానాల కొనుగోలుకు డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ ఆమోదం పొందామని, ఫ్రాన్స్‌తో భారత బృందం సంప్రదింపులు జరిపిందని తెలిపింది. ఫ్రాన్స్‌తో సంప్రదింపులు ఏడాదిపాటు సాగయని, ఒప్పందంపై సంతకం చేసేముందు భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ అనుమతి తీసుకున్నామని పేర్కొంది. దసాల్ట్‌ ఏవియేషన్‌ ఆఫ్‌సెట్‌ భాగస్వాముల ఎంపికలో ప్రభుత్వం పాత్ర ఏమీ లేదని కేంద్రం పునరుద్ఘాటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here